Park: దర్శకుడికి మంచి కథ కావాలి... హీరోయిన్ బొద్దుగా ఉండాలి
ABN , Publish Date - Jul 17 , 2024 | 10:47 AM
‘దర్శకుడికి మంచి కథ కావాలి... హీరోయిన్ బొద్దుగా ఉండాలి. భాషతో పనిలేకుండా తమిళ ప్రేక్షకులు హీరోయిన్లను ఆదరిస్తారు. ఉదాహరణకు అలనాటి నటి సరోజాదేవి. ఇపుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ శ్వేతకు స్వాగతం పలుకుతున్నాం’ అన్నారు దర్శకుడు పేరరసు. తాజాగా ఆయన ‘పార్క్’ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
చిత్రపరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టినవారు పలు కష్టాలు ఎదుర్కొని వచ్చామని చెబుతుంటారని, వాస్తవానికి కష్టాలు మంచి అనుభవాన్నిస్తాయని, ఆ అనుభవమే జీవితానికి పునాది అని సీనియర్ దర్శకుడు, కోలీవుడ్ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్.వి.ఉదయకుమార్ (RV Udayakumar) అన్నారు. అక్షయ మూవీ మేకర్స్ బ్యానరుపై లయన్ ఈ. నటరాజ్ నిర్మాణంలో ఈకే మురుగన్ (EK Murugan) దర్శకత్వంలో రూపొందిన హార్రర్ చిత్రం ‘పార్క్’ (Park). ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను తాజాగా చెన్నై నగరంలో విడుదల చేశారు. ఇందులో దర్శకులు ఆర్‌వీ ఉదయకుమార్, పేరరసు, శరవణ సుబ్బయ్య, సింగంపులి, నిర్మాత లయన్ నటరాజ్, దర్శకుడు ఈకే మురుగన్, నటి శ్వేతా డోరత్తి, హీరో తమన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read- Varalaxmi Couple: ఆమె ఫస్ట్ లవ్ నేను కాదు.. వరలక్ష్మి భర్త సంచలన వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆర్‌వి ఉదయకుమార్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో హీరోను చూస్తుంటే ఈర్ష్యగా ఉంది. నా కంటే వయస్సులో పెద్దవారైన వారికి హీరో వేషాలు, నాకు మాత్రం ముఖ్యమంత్రి, మంత్రి వంటి పాత్రలు ఇస్తున్నారు. అందుకే ఇపుడు హీరోగా నటించాలన్న ఆశ కలిగింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమా తీయొచ్చు. కానీ, ఆ సినిమాలో సరైన కథ, స్ర్కీన్‌ప్లే ఉండాలి’ అని పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ, ‘దర్శకుడికి మంచి కథ కావాలి... హీరోయిన్ బొద్దుగా ఉండాలి. భాషతో పనిలేకుండా తమిళ ప్రేక్షకులు హీరోయిన్లను ఆదరిస్తారు. ఉదాహరణకు అలనాటి నటి సరోజాదేవి. ఇపుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ శ్వేతకు స్వాగతం పలుకుతున్నాం’ అన్నారు. (Park Audio Launch)
హీరో తమన్ కుమార్ (Thaman Kumar) మాట్లాడుతూ, ‘ఈ సినిమా ద్వారా నిర్మాత దర్శకుడిగాను, దర్శకుడు నటుడిగా మారబోతున్నారు. దర్శకుడు మురుగన్‌లో మంచి కామెడీ సెన్స్ ఉంది. వారిద్దరికి శుభాకాంక్షలు. అలాగే, ఈ సినిమాలో నటించిన వారందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. దర్శకుడు మురుగన్ మాట్లాడుతూ, ‘నిర్మాత ఈ అవకాశం ఇవ్వడం వల్ల నాకు మంచి జీవితం లభించింది. సాధారణంగా ఒక హార్రర్ చిత్రంలో దెయ్యాలను పారదోలేందుకు స్వామీజీలను పిలుస్తారు. ఇందులో ఒక సాధారణ వ్యక్తి ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టే విధంగా కాస్త వైవిధ్యంగా తెరకెక్కించాను. ఈ సినిమా విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని కోరారు.
Read Latest Cinema News