అధ్యక్ష పదవికి అతను రాజీనామా చేయాలి: నిర్మాత డిమాండ్
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:26 PM
చిత్ర పరిశ్రమకు ఏదేని మేలు చేయాలన్న తలంపు ఉంటే ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న అతను తక్షణం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఇంతకీ ఎవరా అధ్యక్షుడు? డిమాండ్ చేస్తున్న మాజీ అధ్యక్షుడు ఎవరు? ఏమా కథ? వివరాల్లోకి వెళితే..
చిత్ర పరిశ్రమకు ఏదేని మేలు చేయాలన్న తలంపు ఉంటే ప్రస్తుతం తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న మురళి రామస్వామి తక్షణం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని తమిళనాడు చలన చిత్ర నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు, సీనియర్ నిర్మాత కేఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తన వ్యక్తిగత సమస్యల నుంచి తప్పించుకునేందుకు అధ్యక్ష పదవిని మురళి ఒక రక్షణ కవచంలా ఉపయోగించుకుంటూ అమాయకుడిలా నటించడాన్ని సహించలేమన్నారు.
Also Read-Allu Arjun: అల్లు అర్జున్‌ని మార్చేసిన వెపన్ ఏంటో తెలుసా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ.11 కోట్ల డిపాజిట్లు ఉండేవని, ఆ తర్వాత హీరో విశాల్ సారథ్యంలో కోశాధికారిగా ఉన్న నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు ఈ నిధులను సభ్యుల సంక్షేమం కోసం ఖర్చు చేసి చిల్లిగవ్వ లేకుండా చేశారన్నారు. నిధుల దుర్వినియోగంపై ఇప్పటివరకు ఏ ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదన్నారు. చిత్రపరిశ్రమకు మేలు చేసిన ముఖ్యమంత్రుల్లో కలైంజర్ కరుణానిధి ముందు వరుసలో ఉంటారన్నారు. అలాంటి మహానేత ‘కలైంజర్-100’ పేరుతో నిర్వహించిన శతజయంతి వేడుకలను కూడా నిర్మాతల మండలి సంక్రమంగా నిర్వహించలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరితే ఇప్పటివరకు స్పందన లేదన్నారు.
అంతేకాకుండా, నటీనటులకు వ్యతిరేకంగా రెడ్‌కార్డులు చూపించడం, కొత్త సినిమాల షూటింగుల ప్రారంభోత్సవాలను నిలిపివేయడం వంటి నిర్ణయాలను అన్ని క్రాఫ్ట్‌లతో చర్చించి తీసుకోవాల్సి ఉండగా, షూటింగుల బంద్‌పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల చిత్రపరిశ్రమతో పాటు సినీ నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే చిత్రపరిశ్రమ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే, ధనుష్ వంటి హీరోలకు రెడ్‌కార్డు చూపించడం, షూటింగుల బంద్, కొత్త చిత్రాల ప్రారంభోత్సవాల నిలిపివేత వంటి చర్యలు మరింత హాని చేయడమే కాకుండా మోనోపొలిస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎంఆర్‌టీపీ)కి వ్యతిరేకమని కేఆర్ పేర్కొన్నారు.