Kasthuri: నటి కస్తూరికి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు
ABN , Publish Date - Nov 15 , 2024 | 07:41 AM
రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడు వచ్చి, స్థిరపడిన వారే తెలుగు వారంటూ ఇటీవల నటి కస్తూరి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ కోర్టు మాత్రం ఆమె వ్యాఖ్యలని తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆమెకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. విషయం ఏమిటంటే..
రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడు వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి (Actress Kasthuri Shankar) పట్ల మద్రాస్ హైకోర్టు (Madras High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ విద్వేష ప్రేరేపితమేనని తేల్చిచెప్పింది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదవ్వగా, ముందస్తు బెయిల్ కోసం కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read- Chaitu Jonnalagadda: నాని కూడా ఆశ్చర్యపోయేలా.. పాన్ మసాలా ఫిల్మ్‌కి టైటిల్ ఫిక్స్
ఆమె పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ నేతృత్వంలోని మదురై ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికే కస్తూరి క్షమాపణ చెప్పినందున కేసుల్ని కొట్టివేయాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించగా, జాతివిద్వేష వ్యాఖ్యలు చేసిన కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
‘‘వాక్ స్వాతంత్య్రం అనేది వ్యక్తులు తమ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఉన్న ప్రాథమిక హక్కు. అయితే ఆ మాటలు విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికో, లేదా మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికో దుర్వినియోగం చేయకూడదు. కస్తూరి వ్యాఖ్యలు ముమ్మాటికీ హింసను ప్రేరేపించేవిలా ఉన్నాయి. బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సింది. ఆమె మాట్లాడినప్పుడు ప్రేక్షకుల నుంచి చప్పట్లు ఉండవచ్చు. కానీ, ఆ మాటలు తెలుగు ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది మొత్తం తెలుగు ప్రజలను కించపరచినట్లయింది. మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఇలాంటి నీచమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినవారెవరైనా చట్టప్రకారం విచారణను ఎదుర్కోవాల్సిందే’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.