Hit List: శరత్ కుమార్ లిస్ట్‌లో మరో ‘హిట్’! థియేటర్లలో ఆకట్టుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్
ABN , Publish Date - Jun 07 , 2024 | 09:27 AM
దర్శకుడు త్రివిక్రమన్ కుమారుడు విజయ్ కనిష్క తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌లిస్ట్’. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా, గత వారం విడుదలై పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది.
తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు త్రివిక్రమన్ కుమారుడు విజయ్ కనిష్క (Vijay Kanishka) తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌లిస్ట్’ (Hit List). సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) కీలక పాత్ర పోషించగా, గత వారం విడుదలై పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సూర్య కదిర్ కాకల్లార్ (sooryakathir kaakkallar), కె.కార్తికేయన్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ఆర్కే సెల్యులాయిడ్స్ (RKCelluloids) పతాకంపై ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ (K.S.Ravikumar) నిర్మించారు.
యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్లో రూపొందించిన ఈ చిత్ర కథను పరిశీలిస్తే, ‘ఐటీ కంపెనీలో పనిచేసే విజయ్ తల్లి, చెల్లిని గుర్తు తెలియని ముసుగు దొంగలు కిడ్నాప్ చేస్తారు. పోలీస్ సహాయ కమిషనర్ యళ్వేందన్ (శరత్ కుమార్) సాయంతో నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమవుతారు. అతని చర్యలను ఎప్పటికపుడు విఫలం చేస్తూ వచ్చిన కిడ్నాపర్ల ముఠా.. విజయ్ను ఒక హత్య చేయాలనే నిబంధన పెడతారు. అయితే, ఈ హత్య చేసేందుకు విజయ్ ససేమిరా అనడంతో తల్లిని, చెల్లిని చంపేస్తామని బెదిరిస్తారు.
ఒక చిన్న ప్రాణికి కూడా హాని తలపెట్టేందుకు ఇష్టపడని విజయ్... తన తల్లి, చెల్లి ప్రాణాలు రక్షించుకునేందుకు కిడ్నాపర్ల ముఠా ఒత్తిడి మేరకు హత్య చేశాడా? లేదా? అన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా శరత్ కుమార్ (Sarath Kumar) అద్భుతంగా నటించి, చిత్రానికి ప్రాణం పోశారు. ఆయన కింద పనిచేసే పోలీస్‌గా మునీషకాంత్, డీన్‌గా గౌతం వాసుదేవ్ మేనన్ (Gautham vasudev menon), తండ్రి పాత్రలో సముద్రఖని (samuthirakani), రౌడీగా రామచంద్ర రాజు, అమ్మ పాత్రలో సితార తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.