తలపతి విజయ్ ఆఖరి సినిమాని నిర్మిస్తున్నది తెలుగు నిర్మాత

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:03 PM

తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ పార్టీ ఈమధ్యనే ప్రకటించారు. అయితే రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు ఆఖరిసారి ఒక సినిమా చెయ్యాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఆ సినిమాకి వెట్రిమారన్ దర్శకుడు, నిర్మాత మాత్రం ఇతనే అని తెలిసింది.

తలపతి విజయ్ ఆఖరి సినిమాని నిర్మిస్తున్నది తెలుగు నిర్మాత
Vijay

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈమధ్యనే రాజకీయ పార్టీ ఆరంగేట్రం గురించి అధికారికంగా ప్రకటించారు. తన రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం అని ప్రకటించారు కూడా. అయితే పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేముందు విజయ్ తన చివరి సినిమా ఒకటి చేసి రావాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే ఈ చివరి సినిమా నిర్మాత మాత్రం తెలుగువాడు అవటం ఆసక్తికరం. అతను మరెవరో కాదు 'ఆర్ఆర్ఆర్' సినిమా నిర్మాత దానయ్య. వెట్రి మారన్ ఈ సినిమాకి దర్శకత్వం చేస్తున్నారు అని తెలిసింది.

vetrimaaran.jpg

ఈ సినిమాని దానయ్య తన డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు అని తెలిసింది. ఈమధ్య దానయ్యని ఇదే విషయం అడిగినప్పుడు ఇంకా మాటలు నడుస్తున్నాయి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఖరారు అయినట్టుగా తెలిసింది. వెట్రిమారన్ ఇంతకు ముందు ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు, జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు విజయ్‌ ఆఖరి సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా విజయ్ రాజకీయ ఆరంగేట్రంకి పనికొచ్చే విధంగా ఉండొచ్చు అని ఒక టాక్ కూడా నడుస్తోంది. కొన్ని లక్షలమంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ ఇదే మొదటి సారి వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా చెయ్యడం.

ఈ సినిమాని తెలుగు నిర్మాత దానయ్య చెయ్యడం ఆసక్తికరంగానే వుంది. ఈ సినిమా ఒక హై బడ్జెట్ సినిమాగా రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. తమిళంతో పాటు, తెలుగులో కూడా ఈ సినిమా ఎలాగు విడుదల చేస్తారు అని తెలుస్తోంది.

Updated Date - Feb 06 , 2024 | 12:03 PM