Disha patani: బాబోయ్‌.. ప్రభాస్‌తో మామూలుగా ఉండదు: దిశా పటానీ

ABN , Publish Date - Nov 17 , 2024 | 06:50 PM

ఇప్పుడిలా ఉన్నాగానీ, ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక కష్టాలు అనుభవించా. నటన మీద ఆసక్తితో ఇంజనీరింగ్‌ మధ్యలో వదిలేసి ముంబైకి వచ్చేశా. ఆ సమయంలో నా దగ్గర ఖర్చులకు డబ్బులుండేవి కావు. చిన్న చిన్న మోడలింగ్‌ ఆఫర్లతో కొంచెం కొంచెంగా డబ్బు దాచుకునేదాన్ని

దిశా పటానీ ‘లోఫర్‌’తో తెలుగు తెరకు పరిచయమైనా, ఆ తర్వాత బాలీవుడ్‌కి మకాం మార్చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి దక్షిణాది వైపు దృష్టి సారించింది. మొన్న ‘కల్కి’లో రోక్సీగా మెరిసిన ఈ బోల్డ్‌ బ్యూటీ తాజాగా ‘కంగువా’తో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని ముచ్చట్లివి..

చేతిలో ఐదు వందలతో...
ఇప్పుడిలా ఉన్నాగానీ, ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక కష్టాలు అనుభవించా. నటన మీద ఆసక్తితో ఇంజనీరింగ్‌ మధ్యలో వదిలేసి ముంబైకి వచ్చేశా. ఆ సమయంలో నా దగ్గర ఖర్చులకు డబ్బులుండేవి కావు. చిన్న చిన్న మోడలింగ్‌ ఆఫర్లతో కొంచెం కొంచెంగా డబ్బు దాచుకునేదాన్ని. ఒకసారి ఖర్చులన్నీ పోగా చివరికి ఐదు వందల రూపాయలే మిగిలాయి. రేపటికి ఎలా? అనే భయంతో బతికా. ఆ తర్వాత లక్కీగా నా కెరీర్‌ పుంజుకుంది. దాంతో ఆర్థిక కష్టాల నుంచి బయటపడ్డా. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే తెలియకుండానే కళ్లు చెమ్మగిల్లుతాయి.

Disha-2.jpg
కొన్ని క్షణాలు షాకయ్యా

‘కంగువా’ లాంటి పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో భాగమవ్వడం నిజంగా నా అదృష్టం. ఇందులో ఆఫర్‌ రాగానే నమ్మలేకపోయా. సూర్య సర్‌కు జోడిగా నటించబోతున్నానని తెలిసి కొన్ని క్షణాలు షాకయ్యా. తరువాత తేరుకొని ఎగిరిగెంతేశా. సూర్యతో పనిచేయడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఆయన కళ్లే ఎక్కువగా మాట్లాడతాయి.

 
ఫిట్‌నెస్‌ ముఖ్యం
ఫిట్‌గా కనిపించడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతా. వర్కవుట్స్‌, కచ్చితమైన డైట్‌ ఫాలో అవుతుంటా. వారానికి ఆరు రోజులు జిమ్‌లో కసరత్తులు చేస్తా. పొద్దున్నే ఒక గంటసేపు యోగాకి కేటాయిస్తా. స్క్వాట్స్‌, డెడ్‌ లిఫ్ట్‌లు, మిలిటరీ ప్రెస్‌లు, షోల్డర్‌ ప్రెస్‌లు, బైసెప్‌ కర్ల్స్‌, ట్రైసెప్‌ ఎక్స్‌టెన్సన్స్‌ క్రమం తప్పకుండా చేస్తుంటా. ఇక వారమంతా డైట్‌ పాటించి, ఆదివారం మాత్రం నచ్చినవన్నీ తినేస్తా. పాన్‌కేక్‌, ఐస్‌క్రీమ్‌, చాక్లెట్స్‌ అంటే పిచ్చి. రోజుకు కనీసం ఎనిమిది గంటలైనా కంటి నిండా నిద్రపోతా.

 
కారు రిపేరింగ్‌ వచ్చు..
నాన్నేమో పోలీస్‌, అమ్మ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, సోదరి ఆర్మీ లెఫ్టినెంట్‌... ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రంగం. నన్ను, నా సోదరిని అబ్బాయిల్లాగే పెంచారు నాన్న. ఆడపిల్లలైనా సరే అన్నీ నేర్చుకోవాల్సిందే అని డ్యాన్స్‌, కిక్‌ బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, జిమ్నాస్టిక్స్‌... ఇలా అన్నీ నేర్పించారు. హఠాత్తుగా రోడ్డుపై కారు చెడిపోయినా ఎవరి మీదా ఆధారపడొద్దని, కారు రిపేరింగ్‌లోనూ శిక్షణ ఇప్పించారు.

Disha-3.jpg
చాలా సిగ్గరిని

బోల్డ్‌గా కనిపిస్తాను గానీ చాలా సిగ్గరిని. తొమ్మిదో తరగతి దాకా జీన్‌ప్యాంట్‌, టీ షర్ట్‌, బేబీ కటింగ్‌తో అచ్చం టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. పదో తరగతికి వచ్చాక జుట్టు పెంచడం మొదలెట్టా. స్కూల్‌లో ఎవరితో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. ఇక ప్రపోజల్స్‌ అంటారా... బక్క పలచగా ఉంటాననో లేక అతిగా సిగ్గు పడతాననోగానీ అబ్బాయిలు నాతో మాట్లాడేవారు కాదు.

ఆ రోజు ఫుల్‌గా లాగించా
ప్రభాస్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. ‘కల్కి’ షూటింగ్‌ మొదటి రోజే యూనిట్‌ అందరికీ ఇంటి నుంచి వంటలు చేయించి తీసుకొచ్చారు. ఆరోజు ఫుల్‌గా లాగించేశా. బాబోయ్‌... ఎన్ని రకాల వెరైటీలో. ఇప్పటికీ ఆ వంటకాలు గుర్తొస్తే నోట్లో నీళ్లూరుతాయి. అంత పెద్ద స్టార్‌ అయినా కూడా ప్రభాస్‌కు ఇసుమంత కూడా గర్వం ఉండదు. నిరాడంబరమైన వ్యక్తి. గ్రేట్‌ పర్సన్‌.

వాళ్లని కాపీ కొడతా...

అందం కోసం మార్కెట్‌లోకి వచ్చిన లేటెస్ట్‌ మేకప్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవుతా. న్యూడ్‌ షేడ్‌ లిప్‌స్టిక్స్‌ అంటే ఎంతిష్టమో. నా హ్యాండ్‌బ్యాగ్‌లో లిప్‌స్టిక్స్‌, బ్లష్‌ ఉండాల్సిందే. జపనీస్‌ యానిమేషన్‌ సిరీస్‌లకు పెద్ద అభిమానిని. అందులో వాళ్ల లుక్స్‌, ఔట్‌ఫిట్స్‌ భలే ఆకట్టుకుంటాయి. ఫ్యాషన్‌ విషయంలో వాళ్లనే కాపీ కొడుతుంటా.

Updated Date - Nov 17 , 2024 | 06:50 PM