Gopichand: ప్రభాస్ మ్యారేజ్ గురించి గోపీచంద్ ఏమన్నారంటే...

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:20 PM

తన స్నేహితుడు ప్రభాస్ పెళ్లి గురించి, తన సినిమాల గురించి, తెలుగులో ఎందుకు ఇప్పుడు కొత్తగా కథలు రావటం లేదు అనే విషయం గురించి, ముందు ముందు దర్శకత్వం చేస్తారా అనే ప్రశ్నకి, ఇంకా చాలా ప్రశ్నలన్నింటికీ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు గోపీచంద్. అతని సినిమా 'భీమా' మార్చి 8న విడుదలవుతోంది.

Gopichand: ప్రభాస్ మ్యారేజ్ గురించి గోపీచంద్ ఏమన్నారంటే...
Gopichand talks about his upcoming film 'Bhimaa' and also about his friend Prabhas

మంచి విజయం కోసం పరితపిస్తున్న నటుల్లో గోపీచంద్ ఒకరు. ఇప్పుడు 'భీమా' అనే సినిమాతో మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా విడుదలవుతోంది, ఈ సినిమా నేపధ్యం పరశురామ క్షేత్రం అని చెప్పారు. అందువలన మహాశివరాత్రికి కావాలనే ఈ సినిమా విడుదల చేస్తున్నారా అంటే, 'అలాంటిదేమీ లేదు, ఆలా వచ్చింది అంతే' అని చెప్పారు గోపీచంద్. మేము డిసెంబర్ లో విడుదల చెయ్యాలని అనుకున్నాం, కానీ అప్పుడు 'సలార్' లాంటి పెద్ద సినిమా రావటం, అన్ని సినిమాలు వాయిదా పడటం జరిగింది. జనవరి అనుకున్నాం, అప్పుడు కూడా పండగ సినిమాలు చాలా వున్నాయి, ఇక ఆలా వాయిదా పడుతూ ఇప్పుడు మార్చి 8, మహా శివరాత్రికి వచ్చింది. అలా జరిగిపోయింది కానీ, మేమేమీ అనుకోలేదు, అని చెప్పారు. (Gopichand talks about his upcoming film Bhimaa)

gopichandaboutprabhas.jpg

'భీమా' సినిమా గురించి మాట్లాడుతూ 'ఈ సినిమా అన్ని భావోద్వేగాలు కలగలిపిన ఒక వాణిజ్యపరమైన సినిమా. తప్పకుండా ఆడుతుంది అనే నమ్మకం మాత్రం వుంది' అని చెప్పారు. దర్శకుడు హర్ష ఈ కథ నాకు చెప్పేటప్పుడు, భీమా పాత్రకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇంతకు ముందు పోలీసాఫీసర్ పాత్రలు చేసినా అందులో కథ అంతా ఆ పోలీసు పాత్ర చుట్టూ తిరుగుతాయి, కానీ ఇందులో అలా కాదు, వేరేలా ఉంటుంది, ఒక చిన్న సెమి ఫాంటసీ కూడా ఉంటుంది, ఆ పాయింట్ కొత్తగా ఉండటమే కాకుండా నాకు బాగా నచ్చి ఈ సినిమా చేసాను అని చెప్పారు గోపీచంద్.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' సినిమాలో కూడా బాలకృష్ణ ఒకటి మామూలు పాత్ర, రెండోది అఘోరా లాంటి పాత్ర. ఇప్పుడు ఈ 'భీమా'లో కూడా రెండు పాత్రలు ఒకటి పోలీసాఫిసర్, రెండోది ఒక శక్తివంతమైన పాత్ర అలానే వున్నాయి కదా, మరి రెండు సినిమాలకి ఏమైనా సంబంధం ఉందా అని అడిగితే లేదు అన్నారు. (Gopichand felt happy when people comparing his Bhimaa with Balakrishna's Akhanda) 'నాకు కథ చెప్పేటప్పుడు కూడా ఆలా అనిపించలేదు. కానీ ట్రైలర్ చూసి అందరూ ఆలా అనుకుంటున్నారు, అనుకుంటే మంచిదే కదా'. 'అఖండ' సినిమాతో ఈ 'భీమా' పోల్చడం నాకైతే మంచిదే అనిపిస్తుంది. ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు వున్నాయి, అలాగే వినోదాత్మక సన్నివేశాలు కూడా చాలా వున్నాయి. దీనికితోడు మంచి భావోద్వేగాలు వున్నాయి. పోరాట సన్నివేశాలలో హీరో వెళ్లి పది ఇరవై మందిని కొడితే ప్రేక్షకుడు చాలా బోర్ ఫీల్ అవుతాడు, ఒక సెన్స్ లేకుండా పోతుంది, అదే అందులో ఒక భావోద్వేగం వుండి, ఆ పోరాట సన్నివేశం చేస్తే, చేసేవాళ్ళకి, చూసే వాళ్ళకి కూడా హత్తుకుంటుంది. ఈ సినిమాలో అన్ని అలా కుదిరాయని అనుకుంటున్నాను అని చెప్పారు.

gopichandaboutbhimaa.jpg

గోపీచంద్ అంటే యాక్షన్ సినిమాలు చేస్తారు అని అంటారు కానీ, అతను చేసిన కామెడీ సినిమా 'లౌక్యం' బాగా ఆడింది అది పెద్ద హిట్ అతని కెరీర్ లో. మరి అలాంటివే ఎందుకు ప్రయత్నం చెయ్యకూడదు? 'వినోదాత్మక సినిమాలు చేసేటప్పుడు ఒక పరిధి వుంటుంది, అంతవరకే బాగుంటాయి కూడా. 'లౌక్యం' తీసుకుంటే ఆ సినిమాలో హీరోయిజం ఉండదు, వినోదాత్మకంగా సన్నివేశాలుండి, సినిమా చివరి వరకు అలా వెళ్లిపోతూ ఉంటుంది. మళ్ళీ అన్ని సినిమాలకి అలా కుదరదు, అప్పుడప్పుడు ఆలా సెట్ అవుతూ ఉంటాయి 'లౌక్యం' లాంటి సినిమాలు' అని చెప్పారు. 'లౌక్యం' విజయం సాధించింది అని 'సౌఖ్యం' కూడా అదే పాటర్న్ లో వినోదాత్మకంగా తీసాము, కానీ అది నడవలేదు. ఇప్ప్పుడు ఈ 'భీమా' లో అన్ని ఎలెమెంట్స్ వున్న సినిమా, బాగుంటుంది అనే అనుకుంటున్నా. (I tried to make another comedy film 'Soukhyam' after the hit with 'Loukyam', but it didn't do well)

ఈ సినిమాలో తనకి రెండు షేడ్స్ ఉన్నాయని, అయితే అది డ్యూయల్ రోల్ లేదా ఒక్కడినే రెండు పాత్రల్లో కనపడతానా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పారు. ప్రతి సినిమా విజయం సాధించాలని ప్రతి నటుడు కష్టపడి చేస్తారు. నావి ఇంతకు ముందు సినిమాలు చూస్తే కొన్ని కథలు తెలిసినవే అయినా, అవి కొత్తగా చూపించేట్టు కథనం ఉండాలి, సన్నివేశాలు ఉండాలి, అవి మిస్ అయ్యాం అని అనుకుంటున్నా. ఉదాహరణకి 'రామబాణం' కథ కూడా పాతదే, కానీ చూపించడంలో కొత్తదనం లేదు అని అనుకుంటున్నాను. అలాగే ప్రేక్షకుడి నాడిని ఎవరూ పసికట్టలేరు, ఒక సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోతాయి, అలా కనెక్ట్ అయ్యేట్టు చెయ్యడంలోనే దర్శకుడు ప్రతిభ ఉంటుంది. ఇప్పుడు ఈ 'భీమా' సినిమా దర్శకుడు హర్ష ఈ సినిమాలో కథనం, ట్విస్ట్ లు అన్నీ బాగా చూపించగలిగాడు.

gopichandaboutflops.jpg

పాన్ ఇండియా సినిమా కోసం కథ రాసుకుంటే నడవదు, ఎందుకంటే హిందీ ప్రేక్షకులకి, మన ప్రేక్షకులకి చాలా విషయాల్లో వ్యత్యాసం వుంది. ఇప్పుడు ఒక్క ప్రభాస్ కి తప్పితే ఏ నటుడూ కూడా పాన్ ఇండియా సినిమాలు చెయ్యడం లేదు, ఆ నటులకి కథలు రాయటం లేదు. మీరు గమనిస్తే కనక, పాన్ ఇండియా సినిమా అంటూ విడుదలైన ఒక్క సినిమా కూడా ఈమధ్య ఆడలేదు. పాన్ ఇండియా కథలు రాస్తున్నాం అంటే వర్క్ అవుట్ అవదు, ముందు తెలుగు సినిమా తీయాలి, విజయం సాధించాలి. కొన్నిసార్లు కొన్ని తెలుగు సినిమాలు మిగతా భాషల ప్రేక్షకులకి కూడా కనెక్టు అయిపోతాయి, అలాంటప్పుడు అవి పాన్ ఇండియా మూవీస్ అయిపోతాయి. తెలుగు సినిమా విజయం సాధించాక, అక్కడ విడుదల చేసి అక్కడ కూడా బాగా ఆడితే అప్పుడు అది బోనస్ అవుతుంది. (Gopichand talks about the reason behind that our Telugu directors and writers couldn't get a good story)

మీ స్నేహితుడు ప్రభాస్ చేసిన 'సలార్' లో మిమ్మల్నే తీసుకోవచ్చు కదా! మీ ఇద్దరు బయట మంచి స్నేహితులు, సినిమాలో కూడా అదే స్నేహం కంటిన్యూ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా. 'అది ఆ సినిమా దర్శకుడు అనుకోవాలి, అతనికి ఆ ఆలోచన రావాలి. అయినా మేము బయట మాత్రమే మంచి స్నేహితులం. (Gopichand talks about his friend Prabhas marriage and his comments on it) ఇద్దరినీ కలిపి వెండితెర మీద చూడాలంటే అది దర్శకుడు మాత్రమే చెప్పాలి,' అని చెప్పారు గోపీచంద్. ఎప్పటికైనా ప్రభాస్ తో మళ్ళీ కలిసి సినిమా చెయ్యాలని వుంది అని చెప్పారు గోపీచంద్. అతనొక్కడితోటే కాదు, మిగతా నటులతో కూడా కథ నచ్చితే సినిమా చేస్తాను అని చెప్పారు.

bhimaaaa.jpg

గోపీచంద్ తండ్రి టి కృష్ణ సినిమాలన్నీ విజయం సాధించినవే. అతను సినిమాలన్నీ సామజిక సమస్యలు, ప్రజల సమస్యలు, ఒక బాధ్యతతో కూడిన సినిమాలుగా వచ్చాయి, అన్నీ హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు దర్శకులు, రచయితలు, తెలుగులో కథలు రాయడానికి చాలా కష్ట పడుతున్నారు, లేవు అంటున్నారు. మీరేమంటారు అన్నదానికి, గోపీచంద్ ఇప్పుడున్న వాళ్ళు అందరూ బయటకి వెళ్లడం లేదు అని చెప్పారు. 'అప్పుడు దర్శకులు బయట ప్రజలతో వున్నారు, వాళ్ళ జీవితాలని చూసారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, సమాజంలో జరుగుతున్న సమస్యని తనదైన శైలిలో కథ రాసుకొని సినిమాగా తీసి విజయాలు సాధించారు,' అని చెప్పారు. అయితే ఇప్పుడున్న దర్శకులు, రచయితలు బయటకి వెళ్లకుండా 'డీవీడీలు', ఇంగ్లీష్ సినిమాలు, వేరే బాషల సినిమాలు చూస్తున్నారు, అందుకనే కొత్త కథలు రావటం లేదు, పుట్టడం లేదు. 'సమాజం నుండి వచ్చే కథలు ఎప్పుడైనా విజయం సాధిస్తాయి, అది నూటికి నూరు శాతం నిజం' అని చెప్పారు గోపీచంద్. ఎందుకంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అందులో సమస్యని చూపిస్తున్నప్పుడు అలాంటి సమస్య వుంది కదా అనే ఆలోచన వస్తుంది, కనెక్ట్ అవుతారు. నాకు 'పంతం' సినిమాలో అలాంటి ఒక సమస్య గురించి చెప్పే అవకాశాం వచ్చింది, కానీ అది చివర్లో చెప్పగలిగాను అని చెప్పారు.

gopichandaboutdirection.jpg

ముందు ముందు దర్శకత్వం చేసే ఆలోచన లేదని చెప్పేసారు గోపీచంద్. ఎందుకంటే అది చాలా కష్టతరమైన పని అని, అందుకు తాను తగను అని చెప్పారు. వంట చెయ్యడం చాలా కష్టం కానీ వంట అయ్యాక రుచి చూసి ఏది బాగుంది, ఏది బాగోలేదు అని చెప్పడం సులువు. అందుకని నేను వంట చెయ్యలేను, రుచి చూసి చెప్పగలను. దర్శకత్వం కూడా అంతే, నా వల్ల కాదు. (I don't want to be a director in the future, because it is a hectic job and I can't do it)

ఇంతకీ మీ స్నేహితుడు ప్రభాస్ కి మీరు దగ్గరుండి పెళ్లి చేయొచ్చు కదా, ఎందుకు చెయ్యడం లేదు అని అడిగితే 'నో కామెంట్స్' అని అన్నారు గోపీచంద్. అసలు మీ స్నేహితుడు ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదు అని అడిగినప్ప్పుడు కూడా 'నో కామెంట్స్' అని చెప్పారు గోపీచంద్. తన రాబోయే సినిమాల గురించి మాట్లాడుతూ దర్శకుడు శ్రీను వైట్ల తో సినిమా 30 శాతం పూర్తయిందని, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తో ఒక సినిమా ఉందని, అలాగే దర్శకుడు రాధాకృష్ణతో కూడా కథా చర్చలు జరుగుతున్నాయని, ఆ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని చెప్పారు.

-- సురేష్ కవిరాయని

Updated Date - Mar 05 , 2024 | 02:21 PM