Gangs Of Godavari: షా రుఖ్ ఖాన్ కి 'బాద్'షా', నాకు రాధిక: నేహా శెట్టి
ABN , Publish Date - May 27 , 2024 | 01:47 PM
'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమాలో తను బుజ్జి పాత్రలో కనపడబోతోంది అని, అంజలికి తనకి సన్నివేశాలు సమానంగా వుంటాయని చెప్పింది నేహా శెట్టి. అలాగే ఈ సినిమా 90వ దశకంలో జరిగిన కథ కాబట్టి, తనకి ఎలాంటి సూచనలు చేశారు, ఎవరి ఫోటోలు చూపించారు, అవన్నీ ఆమె మాటల్లోనే ...
రాధికగా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే పాత్రలో అందరినీ అలరించిన నేహా శెట్టి ఇప్పుడు 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమాలో విశ్వక్ సేన్ పక్కన కథానాయకురాలిగా చేస్తోంది. ఇది 90వ దశకంలో గోదావరి నేపథ్యంలో జరిగిన కథ. కృష్ణ చైతన్య దర్శకుడు.
ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఇందులో తన పాత్ర పేరు బుజ్జి అని చెప్పింది. "ఒక బలమైన అమ్మాయిగా ఇందులో కనపడతాను, డబ్బున్న కుటుంబం నుండి వచ్చాను ఇందులో, అందుకని నా పాత్రకి అంతగా యాస అవసరం లేదు," అని చెప్పింది. (Neha Shetty exclusive interview)
ఎవరి రిఫరెన్సు ఇచ్చారంటే...
ఈ కథ 90వ దశకంలో గోదావరి నేపథ్యంలో జరిగిన కథ. ఆ కట్టు, బొట్టు గురించి ఏమైనా సూచనలు, సలహాలు ఎక్కడ తీసుకున్నారు, ఎవరివి చూపించారు? (Neha Shetty talks about her role in 'Gangs Of Godavari' and whose reference she has taken for her role) "అప్పట్లో వచ్చిన కథ కదా, అందుకని నటి శోభన గారివి ఫోటోలు చూపించారు. చీర ఎలా కట్టుకోవాలి, కళ్ళకి కాటుక పెట్టుకోవటం, ఇంకా అప్పట్లో అమ్మాయి ఎలా ఉండేవారు అనే విషయంలో దర్శకుడు కృష్ణ చైతన్య గారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు," అని చెప్పింది నేహా శెట్టి.
అంజలితో సన్నివేశాలు...
అలాగే అప్పట్లో స్త్రీలు చాలా శక్తివంతంగా ఉండేవారు కూడా, అప్పటి సినిమాల్లో కూడా అలానే చూపించేవారు. ఈ సినిమాలో ఎలా వుండబోతోంది? "అవును. అందుకే ఎక్కువ భావోద్వేగాలపైనే దృష్టి పెట్టాము, కళ్ళతో ఎక్కువ భావోద్వేగాలు పలికించే విధంగా ఉంటుంది నా పాత్ర," అని చెప్పింది నేహా. అలాగే అంజలితో కలిసి కొన్ని సన్నివేశాలు ఉన్నాయని కూడా చెప్పింది. "ఆమె సీనియర్ నటి, ఎన్నో సినిమాలు చేశారు, ఆమె సెట్స్ పైన కూడా చాలా కలివిడిగా ఉంటూ, అందరితో మాట్లాడుతూ చలాకీగా వుంటారు. అలాంటి అనుభవం వున్న నటితో పని చెయ్యడం, నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను," అని చెప్పింది నేహా.
రాజమండ్రి భోజనం భలే రుచి
ఇద్దరి పాత్రలు సమానంగా వుంటాయని చెప్పింది. "మా ఇద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి, అంతే కానీ, నేను ఆమెని డామినేట్ చేసే పాత్ర కాదు, అలాగే ఆమెది కూడాను," అని చెప్పింది. సినిమా చిత్రీకరణ కూడా ఎక్కువగా రాజమండ్రి పరిసర ప్రాంతంలో జరిగింది. నేను వెళ్ళేటప్పుడు కొంచెం చల్లగా ఉండేది, కానీ మిగతా సభ్యులు చెప్పడం ఏంటంటే మండుటెండలో చిత్రీకరణ జరిగిందని, కొంతమంది ఈ ఎండని తట్టుకోలేక ఫెయింట్ అయిపోయారని విన్నాను. నేను నా సన్నివేశాలు చేసేటప్పుడు మాత్రం అంత ఎండగా లేదు," అని చెప్పింది నేహా. (Exclusive interview with 'Gangs of Godavari' actress Neha Shetty)
రాజమండ్రి పరిసర ప్రాంతంలో ప్రజలు రోజూ షూటింగ్ చూడటానికి వచ్చేవారని, అక్కడి ప్రజలు చాలా మంచివారు అని చెప్పింది. "ముఖ్యంగా అక్కడ భోజనం మాత్రం చాలా బావుంటుంది. మాకు రోజుకి ఒకరి దగ్గర నుండి ఫుడ్ వచ్చేది, అది మాత్రం సూపర్," అని చెప్పింది నేహా.
రాధిక పాత్ర లక్కీ
తాను ఇంతకు ముందు చేసిన 'డీజీ టిల్లు' లోని రాధిక పాత్రని ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు అంటే అది తన అదృష్టం అని చెప్పారు. "షా రుఖ్ ఖాన్ కి 'బాద్ షా' ఎలానో, నాకు కూడా ఈ రాధిక పాత్ర అలాంటింది. నా కెరీర్ మొదట్లనే అలాంటి పాత్ర రావటం నా అదృష్టం అనే చెప్పాలి," అని చెప్పింది నేహా. అయితే అది నెగటివ్, పాజిటివ్ అని కాదు, ఆ పాత్రలో కొన్ని నెగటివ్ షేడ్స్ వున్న ఒక మంచి పాత్ర" అని ఆ పాత్ర గురించి చెప్పింది.
ఎక్కువ చీరలోనే కనపడ్డాను, కానీ..
నేహా శెట్టి ఇంతవరకు తెలుగులో ఎక్కువగా చీరతో వున్నా పాత్రల్లోనే కనపడింది. అంటే మోడరన్ అవుట్ ఫైట్స్ లో సినిమాలో కనపడేది తక్కువ. ఇప్పుడు ఈ 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమాలో కూడా ఆమె పాత్ర ఎక్కువగా చీరలోనే కనపడుతుంది. "నాకు వచ్చిన సినిమాల్లో అటువంటి పాత్రలో ఎక్కువ వచ్చాయి, అందుకనే ఆ పాత్రల్లో చీరతోనే ఎక్కువ కనపడతాను. కానీ నేను ఇక్కడ సినిమాల్లోకి వచ్చాక మాత్రమే ఎక్కువ చీరలో కనపడుతున్నాను, అంతకుముందు ఎప్పుడూ ఎక్కువ కట్టుకోలేదు. ఈ సినిమాలో పాత్ర చేస్తున్నప్పుడు వేరే ఈవెంట్స్ కి వెళ్లినా కూడా అలానే కనపడితే బాగుంటుంది అని చెప్పారు, అందుకని వేరే ఈవెంట్స్, బయటకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ చీరలోనే కనపడ్డాను," అని చెప్పింది. (Neha Shetty talks about why she is getting more traditional roles than a modern ones)
వర్షం పాటలు హిట్
ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో వర్షంలో ఒక పాట వుంది. ఇంతకు ముందు సినిమాలో కూడా నేహా శెట్టి వర్షం పాట పెద్ద హిట్ అయింది. అదేమైనా కావాలని పెడుతున్నారా? "ఆలా ఏమీ లేదు, సన్నివేశంకి అనుగుణంగానే పాటలు కూడా వస్తున్నాయి. అంతేకానీ ఎదో ప్రత్యేకంగా పెట్టడం లేదు, కానీ పాటలు అన్నీ హిట్ అవటం లక్కీ," అని చెప్పింది నేహా. అప్పట్లో ఎవరైనా నటి గుర్తున్నారా ఇలా వర్షం పాటల్లో డాన్స్ చేసే ఆమె అంటే, "ఆ టైములో అంటే శ్రీదేవి గారు గుర్తుకు వస్తున్నారు, అప్పట్లో ఆమె ఇలాంటి వర్షం పాటలు ఎక్కువ చేశారు," అని చెప్పింది.
వార్ తో పాటు రొమాన్స్ కూడా...
అలాగే 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' అనే టైటిల్ పెట్టారు అంటే ఇందులో కేవలం కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు వుండవు. వాటితో పాటు, థ్రిల్లింగ్, కామెడీ, డ్రామా, మంచి రొమాన్స్, కూడా ఉంటుంది. అలాగే ఈ సినిమా చెయ్యడానికి ముందే విశ్వక్ సేన్ తో పరిచయం ఉందని, అందుకని ఎక్కడా ఎటువంటి ఇబ్బంది పడలేదని చెప్పింది. దర్శకుడు కృష్ణ చైతన్య చాలా నెమ్మదిగా మాట్లాడుతారని, సెట్స్ లో కూడా అలాగే ఉంటారని, మనిషి చాలా నెమ్మది, సాఫ్ట్, కానీ అతనే ఇటువంటి కథ రాశారు అంటే నమ్మలేం అని ఎందుకంటే అతను అంత నెమ్మదిగా ఉంటారని చెప్పింది.
భాష కాదు, పాత్ర ముఖ్యం
తన మాతృభాష కన్నడలో సినిమాలు ఎందుకు చెయ్యడం లేదు అని అడిగితే, "ఇక్కడ నాకు భాష కాదు ముఖ్యం. మంచి పాత్రలు రావాలి. అది ఏ భాషలో వచ్చినా చేస్తాను. నేను కన్నడ లో వచ్చినా చేస్తాను," అని చెప్పింది. ఈమధ్య చాలామంది నటీమణుల మేనేజర్ లు కథలు వింటూ ఆ నటీమణుల సినిమాలు డిసైడ్ చేస్తున్నారని అని అంటే, తన విషయంలో మాత్రం 'నేనే వింటాను' అని చెప్పింది. "నాకు ఎదో ఒక అరగంట చెపితే చాలదు, మొత్తం రెండున్నర గంటలు కథ చెప్పాలి, నేనే వింటాను, చెయ్యాలా, వద్దా అనేది కూడా నేనే డిసైడ్ చేసుకుంటాను," అని చెప్పింది.
ఇందులో మాత్రం మోడరన్ అవుట్ ఫిట్
రాబోయే సినిమా గురించి మాట్లాడుతూ బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన నటిస్తున్నట్టు చెప్పింది. ఇంకా ఆ సినిమా చిత్రీకరణలో తాను పాల్గొనలేదని, ఇప్పుడు మొదలవుతుందని, దానికి దర్శకుడు సాగర్ చంద్ర అని చెప్పింది. అయితే ఆ సినిమాలో చీరలో కాకుండా, మోడరన్ అవుట్ ఫిట్ లో ఎక్కువ కనపడతాను అని చెప్పింది. ఇప్పుడు ప్రేక్షకులు సినిమా చూడటాన్ని అన్ని సినిమాలకి రావటం లేదు, అందుకని కొంచెం ఆసక్తికాగా వుండే పాత్రలు నేను చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకే సెలెక్టివ్ గా వెళుతున్నాను, అని చెప్పింది.
-- సురేష్ కవిరాయని