Abhinav: పిల్లల్ని చెడు వ్యసనాలకు దూరంగా పెట్టాలంటే అదొక్కటే మార్గం
ABN , Publish Date - Nov 15 , 2024 | 01:58 PM
బాలకార్మిక వ్యవస్ధ, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేలా, బాల్యం నుంచే దేశభక్తిని అలవరుసుకునేలా ‘అభినవ్’ చిత్రాన్ని రూపొందించానని అన్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఈ లఘు చిత్ర విశేషాలను తెలిపేందుకు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
‘ఆదిత్య’, ‘విక్కీస్ డ్రీమ్’, ‘డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయనిప్పుడు మరో బాలల చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న బాలల లఘు చిత్రం ‘అభినవ్’. ‘Chased Padmavyuha’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. ఈ లఘు చిత్ర వివరాలను తెలిపేందుకు తాజాగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
Also Read-Breaking News: బాలయ్యకి పద్మ భూషణ్.. విషయం ఏమిటంటే
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని రూపొందించాలనే లక్ష్యంతో ఈ లఘు సినిమాను రూపొందించాను. విదేశాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే దేశ రక్షణ విషయంలో అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తుంటారు. అలా మన పిల్లలను కూడా తీర్చిదిద్దాలి. దురదృష్టవశాత్తూ పిల్లలు గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. డ్రగ్ మాఫియా మన గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా విస్తరించింది. ఎన్‌సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకోవడం ద్వారానే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరు. దేశ రక్షణలో భాగం కాగలరు. ఇలాంటి స్ఫూర్తికరమైన అంశాలతో బాలలను గొప్ప మార్గంలో పయనించేలా ఉత్తేజపరుస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రాన్ని అన్ని ఫిలిం ఫెస్టివల్స్‌కు పంపించాం. అలాగే నేషనల్ అవార్డ్స్‌కు కూడా పంపిస్తున్నామని తెలిపారు.
Also Read- S Thaman: ‘పుష్ప 2’.. 15 రోజుల్లో సినిమా మొత్తం ఎలా కంప్లీట్ చేయగలం
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రాజెక్ట్ ఛైర్మన్ విజయభాస్కర్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత లయన్ సాయివెంకట్, నటుడు బాలాజీ, సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీపూజ వంటి వారంతా దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ ప్రయత్నాన్ని అభినందించారు. పిల్లల్లో స్ఫూర్తినింపే ఇలాంటి మరిన్ని చిత్రాలు సుధాకర్ గౌడ్ ద్వారా రావాలని కోరారు.