Chiranjeevi - Indra: అలా అంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.. చిరు వీడియో వైరల్!
ABN , Publish Date - Aug 20 , 2024 | 03:28 PM
‘‘ఇంద్రసేనారెడ్డి.. అని అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’’ అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.
‘‘ఇంద్రసేనారెడ్డి.. అని అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’’ అని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ‘ఇంద్ర’ (Indra) ఒకటి. సి. అశ్వనీదత్ నిర్మాతగా బి.గోపాల్ (B Gopal)దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ సంచలనమే! ఇప్పుడీ సినిమాను చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రీరిలీజ్ కానుంది. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. (Indra movie Re release)
‘‘ఇంద్రసేనా రెడ్డి అని అంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఆ సినిమాకు ఉన్న పవర్ అలాంటిది. ‘ఇంద్ర’ అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం కథ. అలాగే ఆ చిత్రం కోసం పనిచేసిన వారంతా మనసు పెట్టి శ్రద్థగా వర్క్ చేశారు. అందుకే ఇప్పటికీ ‘ఇంద్ర’కు సంబంధించిన ప్రతీ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ సీన్ నుంచి చూడడం మొదలు పెట్టినా చివరిదాకా చూస్తాం. అదే ఆ కథకు ఉన్న గొప్పతనం. నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ సినిమా ఇది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కథ, స్క్రీన్ ప్లే, ఆర్టిస్టుల నటన, పాటలు, అన్నీ అద్భుతం.
ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి కచ్చితమైన ఉదాహరణ ‘ఇంద్ర’. డైరెక్టర్ బి.గోపాల్ దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు. 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రీరిలీజ్ కావడం నాకెంతో సంతోషంగా ఉంది. 2002 జులై 22 ‘ఇంద్ర’ రిలీజ్ సందర్భంగా ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో.. ఇప్పుడు అలానే ఉన్నాను. ఈతరం వాళ్లకు దీన్ని బిగ్ స్ర్కీన్‌పై చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నదత్, ప్రియాంక దత్‌లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి తన వీడియోలో పేర్కొన్నారు.