Chiranjeevi: పద్మ విభూషణ్‌ చిరంజీవి అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:22 PM

మెగాస్టార్‌ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించనున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పద్మ విభూషణ్‌ అవార్డుకు  ఎంపికైనట్లు సమాచారం.

Chiranjeevi: పద్మ విభూషణ్‌ చిరంజీవి అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌


మెగాస్టార్‌ చిరంజీవిని (Chiranjeevi) మరో అత్యున్నత పురస్కారం వరించనున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పద్మ విభూషణ్‌ (Padma Vibhushan) అవార్డుకు  ఎంపికైనట్లు సమాచారం. గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది పద్మ అవార్డ్స్‌ లిస్ట్‌లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు వినికిడి. ఇప్పటికే చిరంజీవి సినీ, రాజకీయ రంగానికి చేసిన సేవలకుగానూ పద్మ భూషణ్‌ అవార్డుతో గౌరవించింది. కరోనా, లాక్‌డౌన్  సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం చిరుని పద్మవిభూషణ్‌తో సత్కరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కరోనా కష్ట కాలంలో వేలమంది సినీ కార్మికులకు చిరంజీవి ఎంతగా సేవ చేశారో తెలిసిందే. సీసీసీ పేరుతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు మూడు దఫాలుగా నిత్యావసరాలు అందజేశారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించారు. అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సదుపాయాలను కల్పించారు. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో చిరంజీవి పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు బీజీపీ ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో సత్కరించనుందనే వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు నిజం ఏంటనేది మరికొద్ది సేపట్లో తెలియనుంది. 

ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఫాంటసీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. బింబిసార ఫేమ్‌ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. 'విశ్వంభర' లో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - Jan 25 , 2024 | 04:22 PM