Dulquer salmaan Interview: తెలుగు భాషతోనే అది సాధ్యం.. ఆనందంలో దుల్కర్
ABN , Publish Date - Nov 04 , 2024 | 08:33 PM
"తెలుగు భాష గొప్పది. ఏ భాషలోని లేని సౌక్యరం తెలుగు భాషలో ఉంటుంది. నాలాగా లాంగ్వేజ్ తెలియని నటులకు తెలుగు ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాంటి భావం, భావోద్వేగం అయినా తెలుగు చక్కగా చేయగలం. ఇతర భాషల్లో అలా సాధ్యం కాదు.. ఒక్క తెలుగు భాషతోనే అది సాధ్యం
"తెలుగు భాష గొప్పది. ఏ భాషలోని లేని సౌక్యరం తెలుగు భాషలో ఉంటుంది. నాలాగా లాంగ్వేజ్ తెలియని నటులకు తెలుగు ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాంటి భావం, భావోద్వేగం అయినా తెలుగు చక్కగా చేయగలం. ఇతర భాషల్లో అలా సాధ్యం కాదు.. ఒక్క తెలుగు భాషతోనే అది సాధ్యం. తెలుగు బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అని నాన్న తరచూ చెబుతుంటారు’’ అని దుల్కర్ సల్మాన్ (Dulquer salmaan) అన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar). వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) నిర్మించారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ సక్సెస్ పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు.
వెంకీ కథ చెబుతున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా కచ్చితంగా చేయాలి అనుకున్నాను. బ్యాంకింగ్ నేపథ్యాన్ని తీసుకొని మధ్యతరగతి కుటుంబ కథ చెప్పడం కొత్తగా అనిపించింది. నేను ఎప్పటినుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకుంటున్నాను. అది ఈ సినిమాతో నెరవేరింది. నా దృష్టిలో ఇది వాస్తవ కథ. బ్యాక్ గ్రౌండ్ లో హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే, ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో స్కాం చేయడం అనేది కొత్త పాయింట్. ఇది బ్యాంకింగ్ నేపథ్యమున్న సినిమా కావడంతో వెంకీ ఎంతో రీసెర్చ్ చేశాడు. బ్యాంకింగ్ సెక్టార్‌కి చెందినవారు కూడా ఇందులో ఎటువంటి తప్పులు లేవని చెప్పడం విశేషం.
ప్రతి దశలోనూ ఎంజాయ్ చేశా...
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. షారుక్‌ఖాన్ లాంటి వారు కూడా నెగటివ్ షేడున్న పాత్రలు చేశారు. మనలోని నటుడిని బయటకు తీసుకురావాలంటే ఇలాంటి విభిన్న పాత్రలు చేయాల్సిందే. భాస్కర్ పాత్రలో నెగటివ్ షేడ్ కూడా ఉంది. అలాగే ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నటుడిగా ఇలాంటి పాత్రలు చేయడం సంతృప్తినిచ్చింది. ఈ సినిమా ప్రతి దశలోనూ ఎంజాయ్ చేశా.
సైలెంట్.. బట్ ఇంపాక్ట్ ఎక్కువ..
సినిమాకు సంగీతం కూడా ఎసెట్ అయింది. జీవీ చూడటానికి సైలెంట్‌గా ఉంటాడు. కానీ సంగీతంలో సైలెంట్ కాదు. కథకు తగ్గట్టు సంగీతం సమకూర్చుతాడు. అతనిలాగే అతని సంగీతం కూడా స్మూత్‌గా ఉంటుంటి. కానీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఎమోషన్‌ని సంగీతంతో ఫీలయ్యేలా చేయగలదు.
ప్లాన్ చేస్తే రాదు..
సక్సెస్ అనేది ప్లాన్ చేస్తే రాదు. దాని వెనుక చాలా కృషి ఉంటుంది. సినిమా విషయానికొస్తే మంచి కథ కుదరాలి. కష్టపడి పని చేయాలి, మంచి అవుట్‌పుట్ రాబట్టాలి, ప్రేక్షకుల్ని మెప్పించాలి. ఇవన్నీ ప్రాపర్‌గా జరిగినప్పుడు సక్సెస్ అదే వస్తుంది. నేను ప్రాపర్ వేలో వెళ్తున్నాననే అనుకుంటున్నా. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఇలా వరుసగా మూడు సినిమాలు హిట్. కష్టానికి తగ్గ ఫలితం దక్కడం సంతోషంగా ఉంది.
అందరికీ కనెక్ట్...
ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేనివారు ఎక్కడో కానీ లేరు. బ్యాంకింగ్‌కు సంబంధించిన కథ అని, బీసీ సెంటర్స్‌లో ఈ ఈ చిత్రం అర్థం కాదని కొందరు అనుకుంటున్నారు. ఇందులో భాస్కర్ సైడ్ బిజినెస్ లా.. చదువురాని వారికి ఫామ్స్ నింపడం లాంటివి చేస్తుంటాడు. అలాంటి సన్నివేశాలు చాలామందికి కనెక్ట్ అవుతాయి. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత ఈజీగా వెంకీ సినిమా తీశాడు.
అప్పట్లో కలలు కనేవాడిని..
నేను మమ్ముట్టి కొడుకుని అయినప్పటికీ సాధారణంగానే ఉంటా. సాధారణ యువకుల్లాగే ఆలోచిస్తా. కేరళలో లాటరీ బిజినెస్ ఎక్కువ. చిన్నతనంలో లాటరీ తగిలితే, సొంతంగా నాకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని కలలు కనేవాడిని.
తెలుగంటే ఇష్టం...
లక్కీ భాస్కర్ చూసి నాన్న నాతో ఏం చెప్పలేదు. కానీ దర్శకుడు వెంకీతో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. మా ఇద్దరి మధ్య మాటలు మామూలుగానే ఉంటాయి. ఏదైనా కొత్త కథ విని నచ్చితే, ఇద్దరం దాని గురించి మాట్లాడుకుంటాం. నాకు బాగా నచ్చిన కథల గురించి ఆయనకు చెబుతుంటాను. నాన్న తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. నేను తెలుగు సినిమా చేేస ముందు, ఆయనకు చెప్తే.. బ్యూటిఫుల్ ల్యాంగ్వేజ్ అని చెప్పారు. నిజంగానే తెలుగు బ్యూటిఫుల్ లాంగ్వేజ్. నాలాంటి భాష తెలియని వారికి సైతం తెలుగులో ఏదైనా ఎక్స్‌ప్రెస్ చేయగలం. ఎలాంటి భావోద్వేగం, భావం అయిన తెలుగులో కరెక్ట్‌గా పలికించగలం. అది ఇతర భాషల్లో సాధ్యం కాదు. అందుకే నాకు తెలుగంటే ఇష్టం. మహానటికి ముందు తెలుగు, ప్రేక్షకులకు, కొంతవరకు తమిళ ప్రేక్షకులకు నేను తెలుసు. మహానటి తర్వాత తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. సీతారామం చేయడానికి ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఆ ప్రేమ పెరిగింది తప్ప తగ్గలేదు. ఆ ప్రేమను చూసి ఆశ్చర్యపోయాను.
అమ్మో భయం..
తెల్లవారితే సైబర్ క్రైమ్ గురించి ఎన్నో వింటుంటాం. ఒక మెసేజ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేస్తే అకౌంట్ డబ్బు మొత్తం ఖాళీ అని చదివిని ప్రతిసారీ భయపడతా. ఫోన్‌లో ఏదన్నా బ్యాంక్ లోన్ అంటూ మెసేజ్‌లు వస్తే భయపడతాను. ఆ మెసేజ్‌లకు ఓపెన్ చేయను కూడా.
నిజంగానే అన్‌స్టాపబుల్..
ఇటీవల బాలకృష్ణగారి అన్ స్టాపబుల్ షోకి వెళ్లాను. నేను 12 గంటలకు ఫ్లోర్‌లో అడుగుపెడితే.. ఆయన 10 లకే అక్కడ ఉన్నారు. దాదాపు 12 గంటలపాటు షూట్ జరిగింది. ఆయన మాత్రం అదే ఎనర్జీతో ఉన్నారు. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం కష్టం. నిజంగానే ఆయన అన్‌స్టాపబుల్.
నో డ్రీమ్ రోల్...
నాకు డ్రీమ్ రోల్ అని ఏమీ లేదు. అన్ని పాత్రలు చేయాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. ప్రస్తుతం తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. అది కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.