Niharika Konidela: రెండు అడుగులు వెనక్కి వేస్తే తప్పేంలేదు
ABN , Publish Date - Aug 04 , 2024 | 12:02 PM
"ఈతరం అమ్మాయిలకు గౌరవం చాలా ముఖ్యం. కొందరు అమ్మాయిలను అలుసుగా తీసుకుంటారు. నా ఉద్దేశంలో చదువును బట్టి జ్ఞానం రాదు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లను గౌరవించేవాళ్లు.. ఎవరినైనా గౌరవించగలరు. తల్లితండ్రులు తమ పిల్లలకు ఈ తరహా సంస్కృతిని నేర్పాలి’’ అని అంటున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల.
"ఈతరం అమ్మాయిలకు గౌరవం చాలా ముఖ్యం. కొందరు అమ్మాయిలను అలుసుగా తీసుకుంటారు. నా ఉద్దేశంలో చదువును బట్టి జ్ఞానం రాదు. మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లను గౌరవించేవాళ్లు.. ఎవరినైనా గౌరవించగలరు. తల్లితండ్రులు తమ పిల్లలకు ఈ తరహా సంస్కృతిని నేర్పాలి’’ అని అంటున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రాళ్లు’ చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'నవ్య'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. కానీ నా ఎమోషన్స్ బయటకు కనపడనివ్వను. ఇక నాకు ఎమోషనల్ సపోర్టు అంటే మా నాన్నే. చాలామంది నమ్మకపోవచ్చు కానీ.. నాన్న (నాగబాబు) తన విషయంలో ఎమోషనల్‌గా ఉండరు. తాను ప్రేమించే వాళ్లకు ఏదైనా అంటే ఊరుకోరు. నేనూ అంతే. నాన్న తన ఎమోషన్స్‌ను పక్కనపెట్టి నాకు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఎన్నో.
కామెంట్స్ సెక్షన్ చూడను..
సోషల్ మీడియా ద్వారా మన వ్యక్తిగత జీవితంలోకి కొందరు దూసుకువచ్చేస్తారు. ఇప్పటిదాకా నా మీద అంత ఘోరమైన ట్రోల్స్ రాలేదనుకోండి. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినే. నా దృష్టిలో సోషల్ మీడియాకు రెండు పార్వ్శాలున్నాయి. ఒక పార్శ్వం... చాలా మంచిది. మనకు ఎంతో ఉపకరిస్తుంది. దాన్ని తగినట్లుగా వాడుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నేను ఎప్పుడూ కామెంట్స్ సెక్షన్ చూడను. ఎందుకంటే దానిలో విపరీతమైన నెగిటివిటి ఉండొచ్చు.
సర్దుకుపోవాలి...
కొత్త వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు మనం సర్దుకుపోవాలి. వాళ్లను మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. వదిన (లావణ్య త్రిపాఠి) మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఆహ్వానించాం. తను చాలా కాలంగా హైదరాబాద్‌లోనే ఉంది. కానీ ఉత్తరాది అమ్మాయి కావడంతో తన అలవాట్లు భిన్నంగా ఉండేవి. వాటికి అనుగుణంగా మేము మార్పులు చేసుకున్నాం. నా ఉద్దేశంలో కొత్త వ్యక్తి మనింటికి వచ్చినప్పుడు రెండు అడుగులు వెనక్కి వేస్తే తప్పేంలేదు. నేను, వదినా మంచి ఫ్రెండ్స్. గంటల తరబడి మాట్లాడుకుంటాం. నాకు ఒక విషయంలో చాలా భయం ఉంటుంది. ఏ కారణం చేతనైనా నేను ప్రేమించే వ్యక్తులు దూరమవుతారనేది నన్ను ఎక్కువగా భయపెడుతుంది. దీనితోపాటు నాకు బల్లులంటే విపరీతమైన భయం.