Nagababu: కమిటీ కుర్రోళ్ళు పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 30 , 2024 | 07:59 PM
"కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చింది. 2019లో జనసేన పార్టీ ఎలా ఉందో కళ్ళలో మెదిలింది. జాతీయ పురస్కారం రావడానికి అన్ని అర్హతలు ఉన్న చిత్రమిది. తప్పకుండా టీమ్ అందుకోసం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను" అని నాగబాబు అన్నారు
"కమిటీ కుర్రోళ్ళు' (Committee Kurrollu) చిత్రాన్ని చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చింది. 2019లో జనసేన పార్టీ ఎలా ఉందో కళ్ళలో మెదిలింది. జాతీయ పురస్కారం రావడానికి అన్ని అర్హతలు ఉన్న చిత్రమిది. తప్పకుండా టీమ్ అందుకోసం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను" అని నాగబాబు (nagababu) అన్నారు. నిహారిక కొణిదెల (Niharika konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 50 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ జ్ఞాపికలు బహూకరించారు. (Committee Kurrollu 50 days Function)
నాగబాబు మాట్లాడుతూ " కథను ఏదైతే నెరేట్ చేశాడో దాని కన్నా సినిమా ఇంకా చక్కగా తెరపై ప్రెజంట్ చేశాడు. రెండున్నర గంటల వ్యవధి ఉన్న ఈ మూవీలో చివరి 70 నిమిషాల మూవీని చాలా గ్రిప్పింగా డైరెక్టర్ తీశాడు. డైరెక్టర్ యదు వంశీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నేను రాజకీయాల్లో ఉన్నాను. అలాగే జనసేన ప్రస్థానం 2019 వరకు ఎలా ఉండిందనేది సినిమాను చూస్తుంటే గుర్తుకు వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్‌గానూ అనిపించింది. సినిమాలో కొత్తగా నటించిన అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ చాలా చక్కగా నటించారు. కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్ చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంతసేపు మా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. సినిమాలనే కాదు, ఓటీటీల్లోనూ ఇప్పుడు ఎక్కువగా అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి వారి అవసరం ఇండస్ట్రీకి చాలా అవసరం. మూవీని నేచురల్‌గా తెరకెక్కింటంలో వంశీ తీసుకున్న జాగ్రత్తలు గురించి ఎంత చెప్పినా తక్కువే. నిహారిక ఇలాంటి సినిమాను నిర్మించటం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది’’ అన్నారు.
చిత్ర సమర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘ ఈ క్షణాలను ఎప్పటికీ మరచిపోలేం. ఓ మంచి సినిమాను తీస్తున్నామని అనుకున్నాం. కానీ, 50 డేస్ సక్సెస్‌ఫుల్ రన్ ఉంటుందని అనుకోలేదు. మంచి సినిమాను ఆడియెన్స్ చాలా పెద్ద సక్సెస్ చేశారు. భవిష్యత్తులో మంచి కలిసి ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. యదువంశీ ఈ కథను నాకు నెరేట్ చేసినప్పుడు ఇదొక చిన్న సినిమా అని చెప్పారు. అయితే ఇది చిన్నమూవీ కాదని నాకు తెలుసు. ఓ నిజమైన విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని, స్నేహాన్ని ఎంత స్వచ్చంగా చూపించాలని తనకు ఐడియా ఉండేది.. తనతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. ఫణి లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదు. నాన్న నాకు బిగ్గెస్ట్ పిల్లర్‌గా నిలిచారు. ఆయన కథ విని బావుందనగానే నాకు నమ్మకం వచ్చింది. దిల్‌రాజుగారు నాకు ఇన్‌స్పిరేషన్. ఆయనలా డిఫరెంట్ మూవీస్, కమర్షియల్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నాగబాబుగారు ప్రొడ్యూస్ చేసిన రుద్రవీణ చిత్రానికి ప్రేక్షకుడిని, గుడుంబా శంకర్ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్‌ని. ఇప్పుడు ఆయన కుమార్తె నిహారిక నిర్మించిన సినిమాకు ఆహ్వానం అందుకుని రావటం ఆనందంగా ఉంది. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ.. ఇక్కడ వరకు వచ్చింది. ఈరోజు 'గేమ్ చేంజర్' సాంగ్ లాంచ్ ఈవెంట్ ఉంది. కొణిదెల ఫ్యామిలీకి, నాకు ఎక్కడో తెలియని బంధం ఏర్పడింది. ‘కమిటీ కుర్రోళ్ళు’ నిర్మాతలు నిహారిక, ఫణిగారికి అభినందనలు. ఇలాంటి సినిమా తీయటానికి ప్రధాన కారణం నిర్మాతలు. కొత్త సినిమాలు ఆడినప్పుడు నిర్మాతలకు వచ్చే కిక్కే వేరు. ఇలాంటి సినిమాల సక్సెస్ చూసినప్పుడు ఇంకా చాలా మంది నిర్మాతలు కొత్త తరహా సినిమాలు చేయటానికి ముందుకొస్తారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. డైరెక్టర్ యదు వంశీకి కంగ్రాట్స్. తను అనుకున్న విజువల్స్ తీసుకురావటానికి పడ్డ కష్టమే.. సక్సెస్ రూపంలో వచ్చింది. సినిమా చూసినప్పుడు ఆడియెన్స్‌కు నిజమైన జ్ఞాపకం దొరికింది’ అన్నారు.
చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘‘ఈరోజుల్లో 50 రోజులు సినిమా పూర్తి చేసుకోవటం అనేది అరుదుగా జరుగుతుంటుంది. మా తొలి సినిమాకే ఇలా జరుగుతుందని అనుకోలేదు. మంచి సినిమా చేస్తుందనే నమ్మకంతో అడుగులేశాం. నిహారికగారు హెల్త్ బాగోలేనప్పుడు కూడా 10 రోజుల పాటు మా సినిమా టీమ్‌తో ట్రావెల్ చేశారు. ఈ బ్యానర్‌లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. నాగబాబుగారుకి నెరేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే సినిమా ముందుకు కదిలింది. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ వరకు వచ్చాం’’ అన్నారు.