Gopichand: ఆ ఇంటికి వెళ్తుంటే ఆయన కష్టం కనిపిస్తుంది
ABN , Publish Date - Mar 07 , 2024 | 09:35 PM
గోపీచంద్(Gopichand) హీరోగా ఎ.హర్ష దర్శకత్వం వహించిన చిత్రం 'భీమా’ (Bhima) చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ చిరంజీవి (Chiranjeevi) గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
గోపీచంద్(Gopichand) హీరోగా ఎ.హర్ష దర్శకత్వం వహించిన చిత్రం 'భీమా’ (Bhima) చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ చిరంజీవి (Chiranjeevi) గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు."ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రాగానే పుష్ప గుచ్ఛం తీసుకెళ్లి ఇచ్చాను. ఆయన వెంటనే దగ్గరకు తీసుకుని మనలో మనకు ఇవన్నీ ఎందుకు అన్నారు. ‘లేదు అన్నా. ఎక్కడ మొగల్తూరు. ఎక్కడ మీ విజయం. మీ ఇంటికి వస్తుంటే మీరు పడిన కష్టం కనిపిస్తుంది’ అనగానే.. ‘ఇదే కదా మన ప్రయాణం’ అని చెప్పారు. ఆయన మాటలు చాలా ఉన్నతంగా అనిపించాయి. నేను చెన్నైలో అడుగు పెట్టినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నా. తిండి లేకపోయినా ఫర్వాలేదు కానీ, వేరే వాళ్ల వద్ద చేతులు చాచకూడదనుకున్నా. సైకిల్ వేసుకుని ఆఫీసుల చుట్టూ తిరిగా. ఇప్పుడు అక్కడి వెళ్తే ఆనాటి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతాయి. నాకు ఎవరి సపోర్ట్ లేదు. స్వతహాగా ఈ స్థ్థాయికి వచ్చా. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు చాలామందికి.. ‘జీవితమంటే ఇది కాదు’ అని నేను చెప్తుంటా. నిజం చెప్పాలంటే ఆనాటి రోజులు నిజంగానే గోల్డెన్ డేస్’’ అని అన్నారు.
అలాగే బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే ఎవరి జీవిత కథలో నటిస్తారన్న ప్రశ్నకు భగత్‌సింగ్ చేయాలనుందని అదొక పవర్ఫుల్ పాత్ర అని చెప్పారు. రీ రిలీజ్‌ల గురించి మాట్లాడుతూ "మ్యూజిక్ కాస్త మార్చి 4కె ఫార్మట్‌లో 'సాహసం’ రీ రిలీజ్ చేస్తే మళ్లీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ సినిమా కోసం బాగా కష్టపడ్డాం. అది నాకెంతో ఇష్టమైన మూవీ. ‘ఒక్కడున్నాడు’ రీమేక్ చేయొచ్చు. బాలీవుడ్లో సల్మాన్, షారుక్ చిత్రాల్లో విలన్ గా నటించే అవకాశం వస్తే చేస్తారా? అని అడుగుతున్నారు. తెలుగు సినిమాలతో నేను హ్యాపీగా ఉన్నా. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. నా చిత్రాలు చాలా వరకూ హిందీలో డబ్బింగ్ చేయగా బాగా ఆడాయి. చాలామంది హిందీ నిర్మాతలు అవకాశాలిచ్చారు. నో చెప్పా.
ఇష్టంతో చేసిన పనిని చెప్పక్కర్లేదు..
మా చిన్నప్పుడు ఒంగోలులో నాన్న ఓ స్కూల్ పెట్టారు. తర్వాత కూడా మరో స్కూల్ పెట్టాలనుకున్నారు. ఆయన మరణం తర్వాత మేము దాన్ని కొనసాగించలేకపోయాం. నేను ఇప్పటివరకు కొంతమందిని చదివించా. అందులో కొందరు ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. కొంతమందికి నా పేరు కూడా తెలియదు. చదివే వాళ్లకు సాయం చేస్తున్నా. చదువుకు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం.. ఒక వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడటానికి ఉపయోగపడుతుంది. మనం ఇష్టంతో చేసే పనిని బయటకు చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.