Hanuman: హను-మాన్ ఇక్కడ రికార్డుల మోత.. అక్కడేమో!
ABN , Publish Date - Jan 21 , 2024 | 08:07 PM
ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న మాటలు రెండు మాత్రమే అందులో ఒకటి జై శ్రీరామ్ కాగా మరోటి హనుమాన్. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలైన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆప్రతిహాతంగా దూసుకెళుతూ కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తోంది.కానీ మన దేశంలోని ఆ రాష్ట్రాలలో నిరుత్సాహ పరుస్తోంది.
ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న మాటలు రెండు మాత్రమే అందులో ఒకటి జై శ్రీరామ్ కాగా మరోటి హనుమాన్ (Hanuman). మొదటిది అయోధ్యలో రామ మందిర ప్రారంభం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశం మొత్తం జై శ్రీరామ్ నామ స్మరణలతో మారుమ్రోగుతుండగా మరోవైపు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జా (Teja Sajja) లీడ్ రోల్లో అంజనేయున్ని కథా వస్తువుగా తీసుకుని రూపొందించిన హనుమాన్ సినిమా ఈ సినిమా సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఆప్రతిహాతంగా దూసుకెళుతూ కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తుండడంతో పాటు తెలుగు వారి గురించి మరోసారి చర్చించేలా చేస్తోంది.
ఇప్పటికి రిలీజైన అన్ని చోట్ల నుంచి సూపర్ పాజిటివ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 షేర్, రూ. 200 కోట్ల గ్రాస్ సాధించి ఓ చిన్న , మంచి సినిమా చేసే మ్యాజిక్‌ను ప్రపంచానికి మరోమారు చూపించింది. ఒక్క టాలీవుడ్లోనే కాకుండా, బాలీవుడ్లో, ఓవర్సీస్లలోనూ గతంలో ఎప్పుడు చూడని రికార్డులను తిరగ రాస్తున్నది. రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ పోతుంది. ఈ హవా మరో వారం పది రోజులు ఉండేలా కనిపిస్తోంది. ఓవర్సీస్లో 4కోట్ల 10 లక్షల బ్రేక్ ఈవెన్‌తో విడుదలైన హనుమాన్ (Hanuman) సినిమా ఈరోజు వరకు రూ33 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించి గుంటూరు కారం వసూళ్లను దాటేసింది. ఓవర్సీస్లో టాప్ 5 ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలో టాప్‌లో నిలిచింది.
అయితే ఇదిలాఉండగా తమిళ, మలయాళం నుంచి వచ్చే చిన్న సినిమాలను సైతం పెద్ద హిట్‌గా మార్చేస్తారనే పేరు మన తెలుగు వారికి ఉండగా, మన సినిమాలకు ఆ లాంగ్వేజస్ వాళ్లు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో మరోమారు బహిర్గతం అయింది. ప్రపంచమంతా కొనియాడుతున్న మన తెలుగు సినిమా హనుమాన్ (Hanuman)కు ఆ రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లను చూస్తే వారు మన చిత్రాలకు ఇచ్చే విలువ ఏంటో మరోసారి నిరూపితమైంది. తమిళ నాట హనుమాన్ సినిమాకు రూ.2.50 కోట్ల కలెక్షన్లు మాత్రమే రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
తమిళనాడు ,కేరళ రాష్ట్రాలలో హనుమాన్ పెద్దగా ప్రభావం చూపకపోవడం సినీ విమర్శకులను సైతం అశ్చర్య పరుస్తున్నది. ఈ విషయమై ఆ ఇండస్ట్రీలను విమర్శిస్తు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. హనుమాన్(Hanuman) సినిమాకు కర్నాటక, బాలీవుడ్ జనాలు బ్రహ్మరథం పడుతుండడంతో బాలీవుడ్లో ఇంతవరకు ఏ తెలుగు సినిమా ఇప్పటివరకు చేయలేని ఫీట్‌ను అలవోకగా సాధించింది. హిందీలో రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టి లైఫ్‌టైమ్ రికార్డును సృష్టించింది. దీంతో పాటు దేశం మొత్తంలో 2024 తొలి బ్లార్బస్టర్ హిట్ చిత్రంగా, తొలి 100 కోట్ల చిత్రంగా నిలిచింది.