Jani Master: జానీ మాస్టర్ సాయం.. పీఆర్ స్టంట్స్ అంటూ కామెంట్స్
ABN , Publish Date - Oct 28 , 2024 | 11:12 AM
తాజాగా జానీ మాస్టర్ పెట్టిన ఒక పోస్ట్ కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసిన వీడియో అయినా.. కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏమైంది.. జానీ మాస్టర్ ఎవరికీ సహాయం చేశారు. ఆ పోస్ట్‌లో ఏముందంటే..
37 రోజుల జైలు జీవితం అనంతరం జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. రిలీజ్ అయినప్పటి నుండి ఆయన వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. మొదట ట్రెండింగ్‌లో ఉంచినందుకు థ్యాంక్స్ అని, నెక్స్ట్ ఫ్యామిలీతో కలిసిన ఎమోషనల్ మూమెంట్స్ పోస్ట్ చేశాడు. తాజాగా ఆయన పెట్టిన ఒక పోస్ట్ కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసిన వీడియో అయినా.. కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏమైంది.. జానీ మాస్టర్ ఎవరికీ సహాయం చేశారు. ఆ పోస్ట్‌లో ఏముందంటే..
ఆదివారం రాత్రి జానీ మాస్టర్ నెల్లూరు హైవేపై వెళ్తుండగా ఒక ఆక్సిడెంట్ అయినా వ్యక్తిని గుర్తించి సహాయం చేశారు. ఈ వీడియోని.. "మేము నెల్లూరు హైవేలో వెళుతుండగా పిడుగురాళ్ల దగ్గర జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి వెంటనే మెడికల్ సపోర్టు ఇప్పించి ఆసుపత్రికి తరలించాము. దయచేసి, రోడ్లపై రాత్రి పూట డ్రైవింగ్ చేసేటపుడు త్వరగా ఇంటికెళ్ళాలని మీ తలలో ఎన్ని ఆలోచనలున్నా సరే వేగంగా వెళ్ళకండి, హెల్మెట్ ధరించడం మర్చిపోకండి" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు ఇవన్నీ పీఆర్ స్టంట్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్ విధించారు. అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురి చేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఇలా నడుస్తున్న ఈ కేసులో ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్‌పై విడుదలయ్యారు.