Krishna Vamsi: అందరూ యాక్షన్‌ కథలే అంటూ ప్రభాస్ అసంతృప్తి

ABN , Publish Date - Oct 17 , 2024 | 10:56 AM

ప్రభాస్‌ (Prabhas) మంచి నటుడని, అయినా అందరూ ఆయన్ను యాక్షన్‌ తరహా చిత్రాలకే పరిమితం చేస్తున్నారని దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) అన్నారు.


ప్రభాస్‌ (Prabhas) మంచి నటుడని, అయినా అందరూ ఆయన్ను యాక్షన్‌ తరహా చిత్రాలకే పరిమితం చేస్తున్నారని దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) అన్నారు. గతంలో తాను తెరకెక్కించిన ‘ఖడ్గం’ (khadgam)రీ రిలీజ్‌ చేస్తున్న సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన ప్రభాస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘సెన్సిటివ్‌ మూవీ ‘చక్రం’లో నటించేందుకు ప్రభాస్‌ను ఎలా ఒప్పించారు?’ అనే ప్రశ్నకు కృష్ణవంశీ సమాధానమిస్తూ.. ‘‘పని పట్ల ప్రభాస్‌ అంకిత భావంతో ఉంటాడు. మంచి పెర్ఫామర్‌. టాలీవుడ్‌ ఆయన్ను సరిగా వినియోగించుకోవడం లేదు. ఫైట్లకే పరిమితం చేస్తున్నారు. ‘చక్రం’తోపాటు అదే సమయంలో వేరే యాక్షన్‌ ఓరియెంటెడ్‌ స్టోరీ చెప్పా. ‘అందరూ యాక్షన్‌ కథలే చెబుతున్నారు సర్‌’ అంటూ ‘చక్రం’ కథ ఎంపిక చేసుకున్నారాయన. 20 ఏళ్ల తర్వాత పరిస్థితి మారలేదు. ఇప్పటికీ దర్శకులంతా ఆయన్ను యాక్షన్‌ కథలకే పరిమితం చేస్తున్నారు. గతంలో నేను చెప్పిన సబ్జెక్టుతో ఇప్పుడు సినిమా తీయొచ్చు. కానీ, ప్రభాస్‌ ఫుల్‌ బిజీ. నేనేమో అనుకున్న వెంటనే తెరకెక్కించాలనుకుంటా. ఇతర ప్రాజెక్టులు పక్కన పెట్టి నా సినిమా చేయండి అని చెప్పలేను కదా’’ అని అన్నారు.

‘నిన్నే పెళ్లాడతా’ సినిమాని నాగ చైతన్యతో రీ క్రియేట్‌ చేేస అవకాశం ఉందా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘ఆ చిత్రాన్ని ఎవరితోనూ మరోసారి చేయలేం. చైతన్య శైలికి తగ్గట్టు కొత్త సినిమా తెరకెక్కించాలి గానీ ఉన్నదాన్నే మళ్లీ తీయడం ఎందుకు?’’ అని పేర్కొన్నారు. శ్రీకాంత్‌, రవితేజ, ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఖడ్గం’. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకొచ్చి, విజయాన్ని అందుకుంది. ఈ నెల 18న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated Date - Oct 17 , 2024 | 11:24 AM