Mahesh - Raviteja: రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను లాగొద్దు

ABN , Publish Date - Oct 03 , 2024 | 02:38 PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda surekha) చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై  సినీ పరిశ్రమ మండిపడుతోంది. #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్‌ట్యాగ్‌తో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.


తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda surekha) చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై  సినీ పరిశ్రమ మండిపడుతోంది. #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్‌ట్యాగ్‌తో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై సూపర్‌స్టార్‌ మహేశ్‌ స్పందించారు. ‘‘మా సినీ కుటుంబానికి చెందిన ప్రముఖులపై మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా.. ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి. ఇతరుల మనోభావాలను  దెబ్బతీయనంత వరకూ వాక్కు స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి చౌకబారు, నిరాధారమైన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే సినీరంగాన్ని టార్గెట్‌గా చేసుకుని వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నా. మన దేశంలో ఉన్న మహిళలతోపాటు సినీ ప్రముఖులను గౌరవమర్యాదలతో చూడాలి’’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

నీచమైన ఆరోపణలు  
మరో కథానాయకుడు రవితేజ కూడా స్పందించారు. ‘‘రాజకీయ యుద్థం పేరుతో గౌరవప్రదమైన వారిపై ఓ మహిళా మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం నన్ను భయాందోళనకు గురి చేసింది. ఇది అవమానకరమైన చర్య. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లాగకూడదు. సామాజిక విలువలు పెంచుతూ రాజకీయ నాయకులు అందరికీ స్ఫూర్తి గా నిలవాలి’’ అని రవితేజ (Raviteja) అన్నారు.

 సహించలేని చర్య
‘‘మహిళా మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం లేవు. చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదు. ఇతరుల దృష్టి పడటం కోసం వేరే వాళ్ల వ్యక్తిగత జీవితాలపై సులభంగా ఆరోపణలు ఎలా చేయగలుగుతున్నారు? సినీ తారల పేర్లను ఉపయోగించి, వారి వ్యక్తిగత జీవితాలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం అమర్యాదకరం. హద్దులు దాటి ఓ వ్యక్తి ఇమేజ్‌ను దెబ్బతీయడం సహించలేని చర్య. ప్రతి ఒక్కరి జీవితాలను గౌరవిద్దాం. సమాజాభివృద్ధికి పాటుపడుతూ.. బాధ్యతాయుతంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలి. ఒక మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికరంగా అనిపించింది’’

- సంయుక్త మీనన్‌ (samyuktha menon)

అన్యాయంగా టార్గెట్‌ చేస్తుంటారు
‘‘మూడు లక్షల మంది ఓట్లు వేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధులను  చేయవచ్చు. నటుడిగా ఉండాలంటే 100 మిలియన్ల మంది నమ్మకాన్ని సంపాదించుకోవాలి. స్త్రీలను ఇలా కించపరచడం ఆమోదయోగ్యం కాని విషయం. నటీనటులపై మీకు ఇలాంటి నిస్సారమైన అభిప్రాయం ఉండటం నిజంగా బాధాకరం. నటీనటులుగా.. విరాళాలు, సేవ కార్యక్రమాలు, పన్నులు చెల్లిస్తూ సామాజిక సేవలో లో మేము ముందంజలో ఉన్నాం. మేము ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినప్పటికీ ఇతరుల దృష్టి పొందడం కోసం మమ్మల్నే అన్యాయంగా టార్గెట్‌ చేస్తుంటారు. రాజకీయ లబ్థి కోసం వ్యక్తిగత జీవితాలను హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాలకు మా జీవితాలను దూరంగా ఉంచాలని కోరుతున్నా’’
- తేజా సజ్జా (Teja sajja)

Updated Date - Oct 03 , 2024 | 02:45 PM