Ratan Tata: టాటా అసాధారణ మనిషి.. భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు
ABN , Publish Date - Oct 10 , 2024 | 07:55 AM
భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఎక్స వేదికగా టాటా సేవలను గుర్తుచేస్తూ నివాళులు అర్పించారు.
భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) మరణంపై యావత్ భారతదేశం దిగ్బ్రాంతికి లోనయింది. మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల వారు కూడా టాటా మరణంపై స్పందిస్తూ తమ సానుభూతిని తెలియ జేస్తున్నారు. టాటా తమ తమ దేశాలలో చేసిన సేవలను కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ నుంచి దర్శకుడు రాజమౌళి స్పందించి సామాజిక మాధ్యమం ద్వా రా నివాళులర్పించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. తన ఎక్స్ అకౌంట్‌లో రతన్ టాటాను గుర్తు చేసుకుంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ టాటాకు నివాళులర్పించారు.
భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలుగా ఏ ఒక్క భారతీయుడు కూడా అతని సేవలను ఏదో రకంగా పొందని వ్యక్తి లేడు. మన దేశం చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు, నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి, అసాధారణ మానవుడు, రతన్ టాటా గారు ఇచ్చిన విరాళాలు టాటా బ్రాండ్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా నిర్మించడమే కాకుండా మన దేశ నిర్మాణానికి అద్భుతంగా దోహదపడ్డాయి. నిజంగా టాటా ఓ మెగా ఐకాన్. అతని మరణంతో మనం అమూల్యమైన మనస్సును కోల్పోయాం. భారతీయ పారిశ్రామికవేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు, సమగ్రత మరియు దృక్పథం ఎల్లప్పుడూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయి మరియు మార్గనిర్దేశం చేస్తాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అటూ చిరంజీవి (Chiranjeevi) తన పోస్టులో తెలిపారు.