Chiranjeevi: సీతారాం ఏచూరి మ‌ర‌ణం.. మనోవేదనకు గుర‌య్యా

ABN , Publish Date - Sep 13 , 2024 | 11:34 AM

సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త తీవ్ర మనోవేదనకు గురి చేసిందని. విద్యార్థి కార్యకర్తగా ప్రారంభించినప్పటి నుంచి ఏచూరి గారు ఎల్లప్పుడూ అణగారిన వారి గొంతుగా ఉండేందుకు కృషి చేశార‌ని మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు.

chiranjeevi

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం (Sitaram Yechury) నిన్న సాయంత్రం మ‌ర‌ణించిన సంగ‌తి అంద‌రికీ విధిత‌మే. గత నెల 19న ఆయన న్యుమోనియాతో బాధపడుతూ.. ఎయిమ్స్‌లో చేరగా ఛాతీ భాగంలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. అయితే వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేక పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు సీతారాం ఏచూరి కన్నుమూశారు.

sitaram-6.jpg

ఈ విష‌యం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) త‌న సోష‌ల్ మీడియా ద్వారా సానుభూతి తెలిపారు. ఆయ‌న త‌న పోస్టులో ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్న ప్రముఖ నాయకుడు సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూశారనే వార్త తీవ్ర మనోవేదనకు గురి చేసింది. విద్యార్థి కార్యకర్తగా ప్రారంభించినప్పటి నుంచి ఏచూరి గారు ఎల్లప్పుడూ అణగారిన మరియు సామాన్య ప్రజల గొంతుగా ఉండేందుకు కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు మరియు మొత్తం సీపీఎం సోదర వర్గానికి నా హృదయపూర్వక సానుభూతి. ప్రజా సేవ మరియు దేశం పట్ల వారి నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది ంటూ పోస్టులో పేర్కొన్నారు.


ఇదిలాఉండ‌గా సీతారాం ఏచూరి (Sitaram Yechury) భౌతికయాన్ని రేపు ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీవర్గాల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో ఉంచనున్నారు. అనంతరం సీతారాం ఏచూరి కోరిక మేర‌కు రేపు సాయంత్రం 5 గంటలకు ఆయ‌న పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌ మెడికల్ కాలేజీ పరిశోధనల కోసం అప్పగించనున్నారు. ఇక సీతారాం ఏచూరి భార్య సీమా చిస్తీ ప్రస్తుతం ‘ద వైర్‌’కు ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా.. ఒక కుమారుడు ఆశిష్‌ 2021లో కొవిడ్‌తో చనిపోగా.. కుమార్తె అఖిల.. ప్రస్తుతం ఎడింబరో విశ్వవిద్యాలయం, సెయింట్‌ ఆండ్రూస్‌ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా ప‌ని చేస్తోంది.

Updated Date - Sep 13 , 2024 | 11:34 AM