Nandamuri Balakrishna: గత సీజన్‌లతో పోలిస్తే.. దబిడిదిబిడే

ABN , Publish Date - Oct 12 , 2024 | 05:16 PM

ఇప్పటికే వివిధ షోలకు హోస్ట్‌గా చేయమని నన్ను చాలామంది సంప్రదించారు. నేను ఒప్పుకోలేదు. గత సీజన్ల కంటే సీజన్‌-4 ఇంకా బాగుంటుంది. అది మీరే చూస్తారు’’ అని బాలకృష్ణ అన్నారు.


నందమూరి బాలకృష్ణ (NBK)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓటీటీ షో  'అన్‌స్టాపబుల్‌’ సీజన్‌ -4' (Unstoppable -4) అక్టోబర్‌ 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దసరా పండుగను పురస్కరించుకుని దీనికి సంబంధించిన ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలయ్య ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. "ఇప్పటికే వివిధ షోలకు హోస్ట్‌గా చేయమని నన్ను చాలామంది సంప్రదించారు. నేను ఒప్పుకోలేదు. గత సీజన్ల కంటే సీజన్‌-4 ఇంకా బాగుంటుంది. అది మీరే చూస్తారు’’ అని అన్నారు.

‘‘దసరా అంటేనే అమ్మవారు. శక్తి రూపం. గెలుపు అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏదైతే కొత్తగా అనుకుంటామో ఆ జయం మనల్ని వరిస్తుంది. అందుకు ప్రతీక ఈ దసరా శరన్నవరాత్రులు. ‘అన్‌స్టాపబుల్‌’ మొదలవ్వడమే ఒక విస్పోటనం. నాన్నగారు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. వారి స్ఫూర్తితోనే ‘అన్‌స్ట్టాపబుల్‌’లాంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారా. ఇంతకుముందు అలాంటి ఆఫర్లు వచ్చాయి. ఈ షో చేయమని వేరే ఎవరైనా అడిగి ఉంటే  కాదు అనే చెప్పేవాడిని. కేవలం అరవింద్‌గారి కోసమే ఒప్పుకొన్నా. ఐఎండీబీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఈ షో 18వ స్థానంలో ఉందటం అద్భుతం. ఎంతో మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ షోకు వచ్చారు. వాళ్ల వల్ల కూడా ఈ షో సక్సెస్‌ అయింది. ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినా, అన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చారు. కొత్తగా ఏది వచ్చినా తెలుగు ప్రజలు ఆదరిస్తారు. అందుకే ఈ షో మంచి విజయాన్ని అందుకుంది. ఎన్నో సినిమాలు కామిక్స్‌ రూపంలో వచ్చాయి. ‘అన్‌స్టాపబుల్‌’ మూడు సీజన్లు సక్సెస్‌ అయ్యాయి. అందుకే సీజన్‌-4 కొత్తగా అందించాలన్న ఉద్దేశంతో యానిమేషన్‌ రూపంలో ట్రైలర్‌ తీసుకొచ్చారు’’ అని బాలయ్య చెప్పారు. అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో బాలయ్య ్ఘ భుజాలపై పెడితే, ఆయన దాన్ని ఇంకా ఎత్తున పెట్టారు. ఇప్పటివరకూ వచ్చిన సీజన్లకు పూర్తిగా భిన్నంగా ‘సీజన్‌-4’ ఉంటుంది. మరింత వినోదాన్ని పంచుతుంది’’ అని అల్ల్లు అరవింద్‌ అన్నారు.

Updated Date - Oct 12 , 2024 | 05:16 PM