Niharika Konidela: నిహారిక తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా
ABN , Publish Date - Aug 10 , 2024 | 06:15 PM
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో 16 మంది నూతన నటీనటులతో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్ళు’. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో 16 మంది నూతన నటీనటులతో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్ళు’. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. శనివారం చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను నిర్మించిన సినిమా ఇప్పుడు ప్రజల సినిమా అయిందని ఆనందం వ్యక్తం చేశారు.
‘‘మీరు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపిస్తుందని చాలామంది అంటున్నారు. ఆ ప్రశంసలు అందుకున్నందుకు ఒక నిర్మాతగా ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన వారందరికీ అభినందనలు. నా సోదరుడు, నటుడు అంకిత్.. ఓసారి ఫోన్ చేసి.. తన స్నేహితుడి వద్ద మంచి కథ ఉందని చెప్పాడు. నాకు పెద్దగా ఆసక్తి కలగలేదు. వేర్వేరు కారణాలు చెప్పి మూడు నెలలు వాయిదా వేశా. అతడు అంతలా అడుగుతుంటే కాదనలేక కథ వినడానికి అంగీకరించా. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో అది కూడా ఒకటి. కమిటీ కుర్రోళ్ళు కథ విన్నా. దాని తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మా సినిమా చూసి కొంతమంది సెకండాఫ్‌లో ఇది బాలేదు.. అది బాలేదని రివ్యూలు రాస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒక్కటే మేము వందశాతం మందికి నచ్చేలా సినిమా చేయలేం. 99 శాతం మందికి మా సినిమా నచ్చింది. ఇది ఇప్పుడు జనాల సినిమా అయింది. మా సినిమాని కామెంట్ చేస్తూ ఎవరైనా కామెంట్స్ చేస్తుంటే.. మా చిత్రాన్ని ఆదరించిన వారే వారికి రిప్లై ఇస్తున్నారు’’ అని నిహారిక అన్నారు.
భవిష్యత్తులో చరణ్, బన్నీ, వరుణ్ తేజ్‌లతో సినిమాలు చేస్తారా అని ప్రశ్నకు నా మొదటి ప్రాధాన్యత కథకే. నా వద్దకు ఏదైనా కథ వస్తే .. అది తప్పకుండా వాళ్లకు సూట్ అవుతుందనిపిస్తే కలిసి వర్క్ చేస్తా. చిరంజీవితో ఏదైనా సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు మా చిత్రానికి ఇంత మంచి పేరు వచ్చిన తర్వాత నేను మొదట ఫోన్ చేసింది ఆయనకే. ఆయనతో మాట్లాడాను. చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన చేయద్దామనుకుంటున్నా అని సమాధానమిచ్చారు.