Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన సిరివెన్నెల పాటలు..
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:46 PM
రెబల్‌స్టార్ ప్రభాస్ (prabhas)‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే! ఇటీవల ఆ ఎపిసోడ్ రెండో పార్ట్ విడుదలైంది. ఇందులో ప్రభాస్ తనకు నచ్చిన పాటల గురించి చెప్పుకొచ్చారు.
రెబల్‌స్టార్ ప్రభాస్ (prabhas)‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే! ఇటీవల ఆ ఎపిసోడ్ రెండో పార్ట్ విడుదలైంది. ఇందులో ప్రభాస్ తనకు నచ్చిన పాటల గురించి చెప్పుకొచ్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తో (Sirivennela Sitaramasastri) ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
‘సిరివెన్నెల సినిమాలోని ‘విధాత తలపున ప్రభవించినది..’ పాట అంటే చాలా ఇష్టం. చాలా గొప్పగా ఉంటుంది. ‘సరసుస్వర సుర రరీగమనమౌ సామవేద సారమిది’ లైన్స్ అంత బాగా ఎలా రాశారో.. సిరివెన్నెల గారు పేపర్‌పై పెన్ను పెట్టగానే ఇలాంటి గొప్ప లిరిక్స్ వచ్చేస్తాయేమో. అలాగే ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ పాటలంటే చాలా ఇష్టం. ఆ పాట చరణంలో 'తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను..’ అంటూ వచ్చే లైన్స్‌కు నేను వీరాభిమానిని. ప్రతి తరానికి సరిపోయేలా రాయడం సిరివెన్నెల గొప్పతనం. సాహిత్యానికి ప్రాఽధాన్యం ఉన్న పాటలు రాసిన ఆయనే.. ‘శివ’ సినిమాలో బోటనీ పాఠముంది లాంటి టీజింగ్ సాంగ్ రాశారు. ఈ సినిమా వచ్చినప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా. ఎక్కడికి వెళ్లినా ఈ పాటే పాడివాడిని. ఇది సిరివెన్నెల గారు రాశారని తెలిసి ఆశ్చర్యపోయాను. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది’’ అని ప్రభాస్ అన్నారు.
‘‘ సీతారామశాస్త్రి పాటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆయన పేరు చెప్పగానే ఎన్నో పాటలు గుర్తొస్తాయి. ‘చక్రం’ సినిమాలో జగమంత కుటుంబం పాట మొదట గుర్తొస్తుంది. అలాగే ‘అంకురం’లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు కూడా నాకు నచ్చుతుంది. వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా.. లోతైన భావం ఉన్న పాట అది. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా రాశారు. ‘గమ్యం’లో ఎంతవరకు ఎందుకొరకు కూడా బాగుంటుంది. ‘గాయం’ సినిమాలో నిగ్గదీసి అడుగు.. పాటలో సమాజంపై ఆయన తపన కనపడుతుంది. శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు రాసినవి వింటుంటే ఒక రకమైన ఉద్వేగానికి గురవుతాం. ఎంతోమందిలో శాస్త్రిగారి పాటలు స్ఫూర్తిని నింపుతాయి’ అంటూ సిరివెన్నెల పాటల్లో గొప్పతనాన్ని వివరించారు.