Pushpa 2: సహనానికి పరీక్షా? నిర్మాతల పాలిట శాపమా?
ABN , Publish Date - Jul 18 , 2024 | 02:52 PM
పుష్ప-2 నిర్మాతల సహనానికి పరీక్షగా మారిందా? పర్‌ఫెక్షన్ కోసం హీరో, దర్శకుడు కాలయాపన చేస్తున్నారా? తీసిందే తీసి రోజురోజుకి ఖర్చు పెంచేస్తున్నారా? అంటే అవుననే సమాధానం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
పుష్ప-2 (Pushpa 2)నిర్మాతల సహనానికి పరీక్షగా మారిందా?
పర్‌ఫెక్షన్ కోసం హీరో, దర్శకుడు కాలయాపన చేస్తున్నారా?
తీసిందే తీసి రోజురోజుకి ఖర్చు పెంచేస్తున్నారా?
అంటే అవుననే సమాధానం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. నత్తనడకన సాగుతున్న షూటింగ్ ఒకటైతే, ఆగస్ట్ 15న విడుదల కావలసిన చిత్రం మూడున్నర నెలలు వెనక్కి వెళ్లడంతో ఇలాంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి.
పుష్ప-1 పాన్ ఇండియా (Pan india movie) స్థాయిలో హిట్ కావడం, పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ (Allu Arjun) నటనకు నేషనల్ అవార్డ్ రావడంతో పుష్ప రెండో పార్ట్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. దాంతో దర్శకుడు, హీరో.. పుష్ప-2 (Pushpa 2)ఊహించని రీతిలో అంచనాలకు మించి ఉండాలని ధృడ సంకల్పంతో చిత్రీకరణ ప్రారంభించారు. సుకుమార్ టీమ్ కూడా బెస్ట్ అవుట్‌పుట్ కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే షూట్ మొదలై చాలా కాలం అయినా ఓ కొలిక్కి రాలేదు పర్ఫెక్షన్ పేరుతో రోజులు గడుస్తున్నాయి. చిత్రీకరణ ముందుకెళ్తున్న మాట అయితే ఎక్కడా వినిపించడం లేదు. ఆ అసంతృప్తి చిత్ర బృందంలో కూడా ఉందని టీమ్ నుంచి వార్తలు అందుతున్నాయి. ఇదంతా ఒకటైతే.. అవుతున్న ఆలస్యానికి నిర్మాతలు కూడా సహనాన్ని కోల్పోతున్నారట. ఇది కూడా చిత్ర బృందం నుంచి వస్తున్న మాటే!
రిఫరెన్సులతో కొంత లేటు
తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ పెరుగుతోంది. విడుదలైన సినిమాలు ఆకట్టుకుంటున్న తీరు, సాధించిన సక్సెస్ నుంచి ప్రస్తుతం సెట్ మీద ఉన్న సినిమా హీరోలు రిఫరెన్స్ లు తీసుకుంటున్నారట. 'అందులో అలా ఉంది కదా.. మనం ఇలా చేస్తే బావుంటుంది’ అని పోలికలు కూడా ఆలస్యానికి ఒక కారణం కావచ్చు. అయితే తన ఇమేజ్ వేరు.. తన రూట్ వేరనుకునే అల్లు అర్జున్ కూడా రిఫరెన్స్ మీద దృష్టి పెట్టారట. దర్శకుడికి, హీరోకి మధ్య ప్రస్తుతం ఇలాంటి చర్చలే జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే బన్నీ, సుకుమార్‌కి మంచి సింక్ ఉంది. ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు కాబట్టి.. ఇవన్నీ వాళ్లకు పాజిటివ్‌గానే ఉంటాయి. డబ్బు పెట్టే నిర్మాతలకు మాత్రం కాస్త ఇబ్బందికర విషయమే అని గుసగుసలాడుకుంటున్నారు.
ఏసీ ఫ్లోర్‌లో సెట్టుకి రోజుకి లక్షన్నర?
పుష్ప-2 సినిమాకు సంబంధించి ఎక్కడైతే కానీ నాలుగైదు సెట్స్ ఉన్నాయని చిత్రానికి సంబంధించిన ఓ సాంకేతిక నిపుణులు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీ రెండు భారీ సెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇటీవల వేసిన భారీ బంగ్లా సెట్. మరో ఏసీ ఫ్లోర్‌లో ఇంకో సెట్. కానీ దేనిలోను అనుకున్న సమయంలో షూటింగ్ జరగడం లేదని సమాచారం. కొత్తగా వేసిన బంగ్లా సెట్‌లో ఈ నెల 20 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారని టాక్. కానీ బన్నీ ప్రస్తుతం టూర్‌లో ఉన్నారు. ఆయన వచ్చాక షూటింగ్ ప్రారంభిస్తారా? లేదా హీరో లేని సన్నివేశాలను తెరకెక్కిస్తారా అన్నది చూడాలి. మరో ఏసీ ఫ్లోర్‌లో వేసిన సెట్‌లో ఎలాంటి సన్నివేశాల చిత్రీకరణ జరగడం లేదు. దాని రెంట్ రోజుకి లక్షన్నర. దాదాపు ఐదు నెలలుగా నిర్మాతలు రెంట్ కడుతూనే ఉన్నారట. దానిలో వేసిన లైటింగ్‌కి రోజుకి రూ. 5 లక్షలు అద్దె అని కృష్ణానగర్‌లో గుసగుసలాడుకుంటున్నారు. ఆ లైటింగ్ ముంబై నుంచి వచ్చిందట.
రెండు సీన్లు కోటిన్నర ఖర్చు?
రెండు సీన్లు.. ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్య సాగే సంభాషణ. ఆ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి భారీగా సెట్ వేశారట. జర్మన్ మర్చంట్‌ని పుష్పరాజ్ కలిసి, డీల్ మాట్లాడే సీన్ అట అది. జర్మనీని తలపించేలా గ్రాండ్‌గా ఉండడం కోసం రెండు సీన్లు కోసం ఆ హోటల్ లానును కోటిన్నర వ్యయంతో సెట్ వేశారట. అయితే క్వాలిటీ కోసం మైత్రీ నిర్మాతలు ఎక్కడా తగ్గే టైప్ కాదు. కానీ సినిమా షూటింగ్ జాప్యం జరగడంతోనే కాస్త అసహనంగా ఉన్నారని టాక్. అంతే కాదు ఇంత డిలే మధ్య సాగుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ నిర్మాతలు కాబట్టి ఓర్పుగా ముందుకు తీసుకెళ్తున్నారని, వేరే నిర్మాణ సంస్థ అయితే సగంలోనే దుకాణం సర్దేసేవారని కూడా ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది.