Komati Reddy Venkat Reddy: నో మోర్ బెనిఫిట్ షోస్.. కోమటి రెడ్డి ఫైర్

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:26 PM

'పుష్ప 2' టీమ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.మరోవైపు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మేకర్స్ పై మండిపడ్డారు.

‘పుష్ప-2’ సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టు పిటిషనర్ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ దీనిపై దర్యాప్తు జరపనుంది.

WhatsApp Image 2024-12-06 at 12.56.31.jpeg


ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందన్నారు. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీస్కొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల కలక్షన్స్ అని చెప్తున్నారు కదా బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘ఆ సినిమా హీరోకి , ప్రొడ్యూసర్స్‌కు చెప్తున్న.. వాళ్ళని ఆదుకోండి’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 12:58 PM