Sandhya Theatre Stampede: వర్చువల్‌గానే కోర్టుకు బన్నీ.. రెగ్యులర్ బెయిల్ వచ్చేనా
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:16 AM
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో A 11, నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో A 11, నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో అల్లు అర్జున్ కి కోర్టు డిసెంబర్ 13న రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటితో బన్నీ రిమాండ్ పూర్తి కావడంతో తర్వాత ప్రాసెస్‌లో భాగంగా.. ఆయన ఈరోజు నాంపల్లి కోర్టుకి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వర్చువల్ గా హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించనున్నారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడు, సినీ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ప్రసాదించింది. ఈ కేసులో ఆయన అరెస్టయి జైలుకు వెళ్లిన కొద్ది గంటల్లోనే బెయిలు లభించింది. అలాగే ఈ ఘటనలో అరెస్టు అయిన ముగ్గురికి బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్య చేసే ఉద్దేశంతో దాడి చేయడం, ఉద్దేశ పూర్వకంగా పదునైన ఆయుధాలతో దాడి చేయడం వంటి సెక్షన్లు ప్రస్తుత కేసుకు వర్తించవని హైకోర్టు పేర్కొంది. నిర్లక్ష్యం వల్ల మరణం జరిగిందనుకున్నా ఆ నేరానికి పడే గరిష్ఠ శిక్ష ఐదేళ్లే కాబట్టి బెయిల్‌కు పిటిషనర్ అల్లు అర్జున్ అర్హుడని పేర్కొంది. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అవసరం లేదు కాబట్టి.. ఇది బెయిలబుల్ కేసేనని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం పేర్కొంది.