Silk Smitha: 18 ఏళ్ల కెరీర్.. 450 చిత్రాలు.. ఐదు భాషలు.. ఒకటే క్వీన్..
ABN , Publish Date - Dec 02 , 2024 | 02:53 PM
మాటేమో మత్తు.. చూపేమో మైకం.. ఆమె మాట అదో రకమైన మత్తు.. ఆమె కంటి / కొంటె చూపు మైకం.. యువతకు ఆమె ఒక సెక్స్ సింబల్ అప్పట్లో ప్రత్యేక గీతాలకు కేరాఫ్ అడ్రస్..
ఆమె మాట అదో రకమైన మత్తు..
ఆమె కంటి / కొంటె చూపు మైకం..
యువతకు ఆమె ఒక సెక్స్ సింబల్
అప్పట్లో ప్రత్యేక గీతాలకు కేరాఫ్ అడ్రస్..
ఆమె పాట లేకపోతే బయ్యర్లు సైతం నో అనేవారు..
ఆమె స్టెప్ వేస్తే.. థియేటర్ అయిన, ఆడిటోరియమ్ అయిన దద్దరిల్లిపోవాల్సిందే..
ఆమె సిల్క్‌స్మిత అలియాస్ విజయలక్ష్మీ (Vijaya Lakshmi alias Silk smitha)
సినిమా ఇండస్ట్రీలో 18 ఏళ్ల కెరీర్, 450 చిత్రాలు, ఐదు భాషలు.. ఒకటే తార.. కాదు కాదు క్వీన్.. ఆమే సిల్క్‌స్మిత. (Silk Smitha birthday)
'బావలు సైయ్యా, (Bavalu Saiyya)
సిల్కో సింగారికన్నె సిల్కో
నెరజానవులే.. వర వీణవులే,
అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం..
కొంటే కొనంగి.. వయసిది..
ఇలా పాట ఏదైనా ఆరేళ్ల కుర్రాడి నుంచి అరవైయేళ్ల పెద్దాయన వరకూ కిక్ ఎక్కాల్సిందే! దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో సిల్క్ స్మితకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1980-1990ల సమయంలో ఆమె ఓ సంచలనం. అప్పట్లో ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్. సినిమాలో ఆమె పాట ఉంది అంటే ఆ హుషారే వేరు. డిసెంబర్ 2న ఆమె జయంతి సందర్భంగా ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుందా. సిల్క్‌స్మిత 1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వాలి అనే పల్లెటూరిలో పుట్టిన స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి.
తన తల్లిదండ్రులు చదివించుకోలేని పరిస్థితిలో నాలుగో తరగతిలోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో చైన్నె ట్రైన్ ఎక్కేసింది. తొలుత మేకప్ ఆర్టిస్ట్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల్లో సపోర్టు క్యారెక్టర్స్ చేసుకుంటున్న తరుణంలో 1979లో ‘వండిచక్రం’ సినిమాలో అవకాశం అందుకుంది. అక్కడి నుంచి ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఇందులో బార్ డ్యాన్సర్‌గా గ్లామర్ పాత్ర పోషించి ఓవర్‌నైట్ స్టార్ అయింది. అయితే సినిమాలో ఆమెకు దక్కిన వ్యాంప్ పాత్రలు ఆమెకు నచ్చేవి కాదని చెబుతుండేది. అలాగ డాన్సర్‌గా చేస్తూనే... పలు చిత్రాల్లో నటిగానూ చేసింది.
సీతాకోక చిలుక తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం. ఇందులో శరత్‌బాబు భార్య పాత్ర పోషించింది. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్, అక్కినేని నాగార్జున, మమ్ముట్టి, సుమన్ వంటి సూపర్స్టార్లతో కలిసి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా సినిమాల్లో నటించారు. అయితే సిల్క్ స్మిత జీవితం తెరపై కనిపించినంత రంగులమయం కాదని ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తూండేవారు. నిజానికి మంచి ఆర్టిస్ట్ కావాలన్న ఆమె కోరిక అందుకోసమే సినిమాల్లోకి వచ్చారు. అయితే తమిళంలో వచ్చిన ‘వండిచక్రం’ సినిమాలో సిల్క్ స్మిత బార్ డ్యాన్సర్‌గా నటించడం, మంచి గుర్తింపు రావడంతో దర్శకనిర్మాతలు అలాంటి పాత్రలకే పరిమితం చేశారు. తనదైన శైలి డాన్స్‌లతో డాన్సింగ్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడప్పుడు సహాయనటి పాత్రలు కూడా పోషించారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన స్మిత అర్థాంతరంగా తనువు చాలించింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన పలు సమస్యలతో ఆమె 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని ఓ హోటల్ రూమ్‌లో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అయితే ఆమె మరణ వార్త విని బాధపడిన వారు ఎంతమంది ఉన్నారో.. ఆమె లేదని సంతోషించిన వారు సైతం కూడా ఉన్నారు. ఎందుకంటే నటిగా ఆమె తీసుకునే ధైౖర్యమైన నిర్ణయాలు, వాటితో స్మితకు వచ్చిన పేరును చూసి చాలామంది అసూయపడేవారు. అయితే పరిశ్రమలో అంతటి పేరు తెచ్చుకున్న ఆమె జీవిత కథ తెలిసిన వారు మాత్రం కన్నీరు పెట్టుకోవాల్సిందే.
వ్యక్తిగతంగా ఆమె సున్నిత మనస్కురాలని, తక్కువగా మాట్లాడేదని, చిన్న పిల్లల మనస్తత్వం గలదని సన్నిహితులు చెబుతుంటారు. ఆమె మరణించి 28 ఏళ్లు అవుతున్నా.. సిల్క్ అనే పేరు వినిపిస్తే ఇప్పటికే ప్రేక్షకుల్లో హుషారే. అంతగా ఆమె తెలుగు ప్రేక్షకులపై ప్రభావం చూపించి. ఒక స్టార్ హీరోకు ఉన్న క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
క్వీన్ ఆఫ్ సౌత్
సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా విద్యాబాలన్ మెయిన్ లీడ్‌లో బాలీవుడ్లో ‘డర్టీ పిక్చర్’ మూవీ తెరకెక్కింది. 2011లో వచ్చిన ఈ చిత్రం రూ. వందకోట్లు వసూళ్లు రాబట్టింది. మరో రెండు భాషల్లో సిల్క్ పేరు మీద సినిమాలు వచ్చాయి కానీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కబోతుంది. చంద్రిక రవి మెయిన్ లీడ్‌గా 'సిల్క్ స్మిత - ద క్వీన్ ఆఫ్ సౌత్’ టైటిల్‌తో ఐదు భాషల్లో ఓ సినిమా తెరకెక్కనుంది.
సెట్ ఆమె క్రేజ్ ఎలా ఉండేదంటే..
చెన్నైలో ఓ స్టూడియోలో సాంగ్ షూటింగ్.. సిల్క్ స్మిత మేకప్‌తో రెడీగా ఉంది. ఓ యాపిల్ తింటుండగా షార్ట్ రెడీ అనగానే సగం తిన్న యాపిల్‌ను అక్కడే పెట్టి వెళ్లిందట. అక్కడే ఉన్న మేకప్ ఆర్టిస్ట్ ఆ యాపిల్‌ను వేలంగా వేయగా 26 వేలకు ఓ వ్యక్తి పాడుకున్నారట. అప్పట్లో ఆమె క్రేజ్ అలా ఉండేదని ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.