Mohanraj: సినీ ఇండ‌స్ట్రీలో విషాదం.. 90s పాపుల‌ర్ విల‌న్ మోహ‌న్‌రాజ్ క‌న్నుమూత‌

ABN , Publish Date - Oct 04 , 2024 | 10:03 AM

సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది. 90ల‌లో పాపుల‌ర్‌ న‌టుడు, క్రూయ‌ల్‌ విల‌న్‌గా పేరు ద‌క్కించుకున్న‌ మోహ‌న్‌రాజ్ గురువారం తుదిశ్వాస విడిచారు.

mohan raj

సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది. 90ల‌లో పాపుల‌ర్‌ న‌టుడు, క్రూయ‌ల్‌ విల‌న్‌గా పేరు ద‌క్కించుకున్న‌ మోహ‌న్‌రాజ్ (Mohanraj) గురువారం తుదిశ్వాస విడిచారు. కేర‌ళ రాష్ట్రానికి చెందిన మోహ‌న్ రాజ్ మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రెండు వంద‌లకు పైగా సినిమాలు చేశారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలుసుకున్న సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. ఆయ‌నకు ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చిన సినిమాల గురించి ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.

మోహ‌న్‌లాల్ హీరోగా 1989లో వ‌చ్చిన కిరీడామ్ అనే సినిమాతో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ఆ సినిమాలో జోస్ అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో త‌న విల‌నిజంతో ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టారు. ఈ సినిమా మోహ‌న్ రాజ్ సినీ జీవితాన్ని మ‌లుపుతిప్పింది. కిరిక్కాడాన్ జోస్‌గానే అత‌డు పాపుల‌ర్ అయి ఆ పేరుతోనే చాలా సినిమాలు చేశారు. స్టార్ విల‌న్స్‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టితో స‌హా సౌత్‌లోని అగ్ర న‌టీన‌టులంద‌రితో సినిమాలు చేశారు. ఈ కోవ‌లో 1990 నుంచి 2008 వ‌ర‌కు బ్రేక్ లేకుండా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ వ‌చ్చారు.

mohanraj.jpg

1990లో రాజ‌శేఖ‌ర్ హీరోగా వ‌చ్చిన రౌడీయిజం న‌శించాలి అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆపై బాల‌కృష్ణ లారీ డ్రైవ‌ర్ సినిమాలో గుడివాడ రౌడీ పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. లారీ డ్రైవ‌ర్ త‌ర్వాత తెలుగులో ఫుల్ బిజీగా మారిన మోహ‌న్‌రాజ్ తెలుగులో ఎక్కువ‌గా బాల‌కృష్ణ సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించారు. వీరి కాంబోలో నిప్పు ర‌వ్వ‌, బొబ్బిలి సింహం, లారీ డ్రైవ‌ర్‌, రౌడీ ఇన్స్‌పెక్ట‌ర్‌, ప‌విత్ర ప్రేమ‌, స‌మ‌ర సింహారెడ్డి, న‌ర‌సింహా నాయుడు, చెన్న‌కేశ‌వ‌రెడ్డి. ప‌ల‌నాటి బ్ర‌హ్మ నాయుడు, ఖైదీ ఇన్‌స్పెక్ట‌ర్ వంటి సినిమాలొచ్చాయి.


చిరంజీవితో స్టువ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్‌, మెకానిక్ అల్లుడు మోహ‌న్ బాబుతో బ్ర‌హ్మ‌, అసెంబ్లీ రౌడీ, శ్రీరాముల‌య్య‌, అధిప‌తి, శివ‌శంక‌ర్‌, వెంక‌టేశ్‌తో చిన‌రాయుడు, పెళ్లి చేసుకుందాం, పోకిరి రాజా, స‌ర‌దా బుల్లోడు రాజ‌శేఖ‌ర్ శివ‌య్య‌, ప్ర‌భాస్ రాఘ‌వేంద్ర నాగార్జునతో శివ‌మ‌ణి, కృష్ణ‌తో పోలీస్ అల్లుడు, హ‌రికృష్ణ‌తో సీత‌య్య‌, స్వామి వంటి సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లు చేశారు. మెత్తంగా ఆయ‌న మ‌ల‌యాళంలో 100, తెలుగులో 30, త‌మిళంలో 10కి పైగా సినిమాల్లో న‌టించారు.మోహ‌న్‌రాజ్ తెలుగులో చివ‌ర‌గా 2004లో వ‌చ్చిన మోహ‌న్‌బాబు శివ‌శంకర్‌ సినిమాలో న‌టించ‌గా మ‌ల‌యాళంలో 2022లో మ‌మ్ముట్టి హీరోగా వ‌చ్చిన రోర్స్చాచ్ అనే సినిమాలో హీరోయిన్ తండ్రిగా క‌నిపించారు.

ఆ త‌ర్వాత అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఇటీవ‌ల గుండెపోటు కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరగా ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం ఆయ‌న‌ తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు వెల్ల‌డించారు. సినిమాల్లోకి రాక‌ముందు మోహ‌న్‌రాజ్ క‌స్ట‌మ్స్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌లో ఏఈవోగా వ‌ర్క్‌చేశారు. ఆ త‌ర్వాత సినిమాల‌తో బిజీ కావ‌డంతో ఉద్యోగానికి దూర‌మ‌య్యారు. మోహ‌న్‌రాజ్‌కు భార్య ఉష‌, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 11:11 AM