Tollywood: కామియో మెరుపులు.. అదనపు ఆకర్షణ
ABN , Publish Date - Oct 20 , 2024 | 08:04 AM
న్యూ ఏజ్, కొత్త తరహా కంటెంట్‌కు అలవాటు పడిన వీక్షకుడిని ఆకర్షించాలంటే చూడని కథను చూపించాలి. తెరపై అద్భుతాలను ఆవిష్కరించాలి. వీటితోపాటు తెరపై నచ్చిన స్టార్లు, గొప్ప కాంబినేషన్లతో అయినా మెస్మరైజ్ చేయాలి.
డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి చెంది, ఓటీటీలు అందుబాటులోకి రావడంతో వీక్షకులకు యూనివర్సెల్ కంటెంట్ వీపరీతంగా అందుబాటులోకి వచ్చింది. భాషలతో సంబంధం లేకుండా పాన్ వరల్డ్ కథలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దాంతో ఓటీటీ ప్రస్తుతం నిత్య అవసరాల్లో ఒకటిగా మారిపోయింది. దీని వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారికి సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. న్యూ ఏజ్, కొత్త తరహా కంటెంట్‌కు అలవాటు పడిన వీక్షకుడిని ఆకర్షించాలంటే చూడని కథను చూపించాలి. తెరపై అద్భుతాలను ఆవిష్కరించాలి. వీటితోపాటు తెరపై నచ్చిన స్టార్లు, గొప్ప కాంబినేషన్లతో అయినా మెస్మరైజ్ చేయాలి. లేదంటే కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌ని థియేటర్స్‌కు తీసుకు రావడం చాలా కష్టమే! మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్ బాట పట్టించటానికి దర్శక నిర్మాతలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఏదో ఒక పాత్రలో ప్రముఖ నటి లేదా నటుడిని కామియో (Cameo roles_ రూపంలో జొప్పిస్తున్నారు. (Cameo's In Tollywood)
కథ రసవత్తరంగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా ఒక స్టార్ మెరుపులా తెరపై మెరవటం ఆ పాత్ర కథకు చాలా కీలకం కావడం ఈ మధ్యకాలంలో చాలానే చూశాం. కొన్ని సందర్భాల్లో ఆ పాత్ర సినిమాకు కీలకం కావచ్చు, అతిథిగా (Guest appearance) మెరిసే పాత్ర కూడా కావచ్చు. ఇలా ప్రేక్షకుల్ని ఆకర్షించడం ఓ ట్రెండ్‌గా మారింది. అయితే ఇది తెలుగు తెరకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి కామియో రోల్స్ చేసిన తారలు ఉన్నారు. దీని వల్ల ప్రేక్షకులతోపాటు ఆ సినిమా హీరోతోపాటు కామియో చేసిన నటుడి అభిమానులను ఆకర్షించే అవకాశం ఉంది.
ఒకరి తర్వాత ఒకరు
ఇటీవల కాలంలో చూసుకుంటే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఎడి’ చిత్రంలో రాజమౌళి (Rajamouli) భైరవకు రైవల్‌గా, రామ్‌గోపాల వర్మ (RGV) చెఫ్ చింటుగా, దుల్కర్ సల్మాన్ పైలట్‌గా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా, మాళవిక నాయర్ ఉత్తరగా ఓ రాణి పాత్రలో, ఫరియా అబ్ధుల్లా కాంప్లెక్స్‌లో డ్యాన్సర్‌గా కాసేపు కనిపించి మెప్పించారు. అలాగే రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన 'మిస్టర్ బచ్చన్' చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ యూత్ యువరాజ్‌గా తనదైన శైలిలో మెప్పించాడు. 'కమిటీ కుర్రాళ్లు' క్లైమాక్స్‌లో మెగా డాటర్ నిహారిక ఓ పాటలో మెరిసింది. నవదీప్ నటించిన ‘లవ్ మౌళి’లో రానా గెస్ట్‌గా కనిపించి మెప్పించారు. ‘మా నాన్న సూపర్ హీరో’లో రాజు సుందరం మెరిశారు. అలాగే టాలీవుడ్‌లో మంచు విష్ణు కీలక పాత్రలో తెరకెక్కుతున్న 'కన్నప్ప' చిత్రంలో ప్రభాస్, కాజల్, శరత్‌కుమార్, అక్షయ్‌కుమార్, ప్రీతి ముకుందన్, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హీరోగానే చేయాలా.. కీలకం అయితే చాలు
కొందరు హీరోలు అయితే ఎప్పుడూ హీరోలుగానే కనిపించాలా? సినిమాకు అవసరం, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటే కామియో చేయడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదు. గతంలో హిందీ చిత్రాల్లో నటించిన నాగార్జున చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నటించారు. ఇందులో నాగార్జున పోషించిన పాత్ర ఆర్కియాలజిస్ట్ పాత్ర సినిమాకు కీలకంగా నిలిచింది. హిందీ ప్రేక్షకులతోపాటు తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. వెంకటేశ్ కూడా తన స్నేహితుడు సల్మాన్ ఖాన్ కోసం ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో కీ రోల్ చేశారు. సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి బరిలో విజయం సాధించిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో మాస్‌మమారాజ రవితేజ చిరుకి తమ్ముడికి కీలక పాత్ర పోషించి మెప్పించారు. గతంలో వీరిద్దరూ అన్నయ్య సినిమాలో కలిసి నటించారు. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ మధ్యకాలంలో విడుదలయిన విజయ్ ‘గోట్’ సినిమాలో ఒక సీనులో ధోని కనిపిస్తాడు. రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో అమీర్‌ఖాన్ ఒక చిన్న పాత్రలో కనిపించనున్నాడనే వార్త ప్రేక్షకులకు కొత్త కిక్‌ను ఇచ్చింది.
బాలీవుడ్‌లో మామూలే...
టాలీవుడ్‌లో ఒకప్పుడు కామియో పాత్రలు అడపాదడపా కనిపిస్తుండేది. బాలీవుడ్‌లో మాత్రం తరచూ ఏదో ఒక సినిమాలో స్టార్ టు స్టార్ కామియో చూస్తుంటాం. పఠాన్ సినిమాలో సల్మాన్‌ఖాన్, 'టైగర్ 3' సినిమాలో షారూక్ ఖాన్, 'ఆల్ఫా'లో హృతిక్ రోషన్, 'ఘామర్' సినిమాలో అమితాబ్ బచ్చన్, 'బ్యాడ్ న్యూస్' సినిమాలో అనన్యపాండేలు ఒక మెరుపు మెరిసి ప్రేక్షకులకు అలరించారు. తాజాగా హిట్ అయిన ‘స్త్రీ2’ సినిమా ఉత్కంఠగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా అక్షయ్‌కుమార్ ఒక మెరుపులా మెరుస్తాడు. చాలా మంది ప్రేక్షకులకు ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా అక్షయ్ పాత్ర గుర్తుండిపోతుంది.
అంతే కాదు బాలీవుడ్ సినిమాల్లో టాలీవుడ్ హీరోలు కామియో పాత్రలు చేసి పాన్ ఇండియా సినిమాలుగా మారుస్తున్నారు. హిందీలో ఆమిర్‌ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ తెరకెక్కించిన ‘లాల్‌సింగ్ చద్దా’లో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. గతంలో హిందీ చిత్రాల్లో నటించిన నాగార్జున చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నటించారు. ఇందులో నాగార్జున పోషించిన పాత్ర ఆర్కియాలజిస్ట్ పాత్ర సినిమాకు కీలకంగా నిలిచింది. విశ్వనాయకుడు కమల్‌హాసన్ కమ్‌బ్యాక్ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య రోలెక్స్ అనే అద్భుతమైన పాత్ర పోషించారు. అది సినిమాకు చాలా ప్లస్ అయింది. చిత్రంలో సూర్య ఎంట్రీతో మూవీ లవర్స్ థియేటర్స్‌లో గోల పెట్టారు.