అదిరిపోయింది నీ సినిమా, సిద్ధార్థ్ రాయ్ దర్శకుడితో సుకుమార్
ABN , Publish Date - Jan 23 , 2024 | 06:17 PM
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సినిమా 'సిద్ధార్థ్ రాయ్' చూసి ఎంతో మెచ్చుకున్నారని, తనని హగ్ చేసుకొని, తన తదుపరి సినిమా సుకుమార్ రైటింగ్స్ సంస్థలో చేస్తున్నానని, దర్శకుడు యశస్వి చెప్పాడు. ఇది తన సినిమా విజయంలా భావిస్తున్నానని చెప్పాడు యశస్వి
దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా నటించిన 'సిద్ధార్థ్ రాయ్' సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. వి యశస్వి దర్శకుడు, అతనికి ఇది మొదటి సినిమా. ఈ ట్రైలర్ చూస్తే కొంచెం 'అర్జున్ రెడ్డి' ఛాయలు వున్నట్టుగా కనిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమా చూసి హగ్ చేసుకున్నారని, అది చూసి విజయం సొంతం చేసుకున్నంత అనుభూతి వచ్చిందని దర్శకుడు యశస్వి చెప్పాడు.
"నా సినిమా నిర్మాత ఫణిగారు నా కథని నమ్మారు. తర్వాత ఆ కథని రాసిన నన్ను నమ్మారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది. కథానాయకుడి దీపక్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో అతను చేసిన నటనని చూసి, తెలుగు సినిమా చరిత్రలో ఒక బెస్ట్ డెబ్యు పెర్ఫార్మెన్స్ గా తన నటన నిలిచిపోతుంది," అని చెప్పాడు దర్శకుడు యశస్వి తన సినిమా 'సిద్ధార్థ్ రాయ్' గురించి. కథానాయకురాలు తన్వీ కూడా చాలా చక్కగా నటించారు అని చెపుతూ ఇందులో ఇంకో నటి కీర్తన ఒక కీలక పాత్ర పోషించింది అని చెప్పారు.
ఈ సినిమా కథ ముందుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కి చెప్పాలని యశస్వి అనుకున్నాడు, కానీ అతని దగ్గరికి వెళ్ళలేకపోయాను అని చెప్పాడు. "సుకుమార్ గారికి ఈ కథ చెప్పాలని అనుకున్నాను. కానీ ఆయన దాక చేరలేకపోయాను.ఈ సినిమా టీజర్ ఆయనకి పంపించాను, అతను వెంటనే సమాధానం ఇచ్చారు. అప్పుడు 'పుష్ప 2' షూటింగ్ లో వున్న ఆయన్ని కలిశాను. టీజర్ గురించి దాదాపు 20 నిముషాలు చర్చించారు. ఆయనకి టీజర్ చాలా నచ్చిందనిపించింది. సినిమా చూస్తాను అన్నారు," అని చెప్పాడు దర్శకుడు యశస్వి.
సుకుమార్ కి రెండు నెలలు తర్వాత యశస్వి 'సిద్ధార్థ్ రాయ్' సినిమా చూపించాడు. "ఫస్ట్ హాఫ్ అవ్వగానే లేచి హాగ్ చేసుకొని 'అదిరిపోయింది సినిమా, నీ తదుపరి సినిమా నా బ్యానర్ లో చేయాలి' అని సుకుమార్ చెప్పారు. దాని ఫలితమే జనవరి 8న వచ్చిన ప్రకటన. నన్ను నమ్మి ఆయన బ్యానర్ లో తదుపరి సినిమా ఇచ్చిన సుకుమార్ గారికి ధన్యవాదాలు. ఆల్రెడీ విజయం సాధించిన అనుభూతిలో వున్నాను. కొత్త ట్యాలెంట్ ప్రోత్సహిస్తున్న సుకుమార్ గారి కృతజ్ఞతలు," అని చెప్పాడు యశస్వి.
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలకు అభిమానిని అని చెప్పాడు యశస్వి. "ఈ సినిమా కోసం ఆయనతో జర్నీ చేసే అవకాశం రావడం, ఏమీ ఆశించకుండా ఆయన ఈ సినిమాకి సాయం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం", అని చెప్పాడు. 'సిద్ధార్థ్ రాయ్' ఫిబ్రవరిలో విడుదలవుతోంది, ఖచ్చితంగా ప్రేక్షకులు ఒక బ్లాస్ట్ చూడబోతున్నారు అని చెప్పాడు యశస్వి.