TFCC: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు.. తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందనిదే
ABN , Publish Date - Oct 03 , 2024 | 07:27 PM
తెలంగాణ మంత్రి మంత్రి కొండా సురేఖ నాగార్జున, నాగ చైతన్య, సమంతలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ స్పందించి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
తాజాగా తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) బుధవారం నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య, సమంతలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రధాన తారలంతా తమ సోషల్ మీడియాల ద్వారా మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సొంత రాజకీయాల కోసం సినిమా సెలబ్రిటీల పేరును వాడుకోవడం తగదంటూ హితవు పలికారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కూడా ఈ ఇష్యూపై స్పందించింది. ఈ సందర్బంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వారు రిలీజ్ చేసిన లెటర్లోని అంశాలు యధాతదంగా..
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, 02-10-2024 నాడు మీడియాలో తెలంగాణకు చెందిన ఒక గౌరవనీయ మహిళా మంత్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తులు, వారి వ్యక్తిగత జీవితాలపై చేసిన అభ్యంతరకరమైన, అవాస్తవమైన వ్యక్తిగత ఆరోపణలపై బాధ మరియు ఆవేదనను వ్యక్తం చేస్తుంది. అనేక సంవత్సరాల నుండి జరుగుదున్నట్లుగానే వేరే ఏదైనా సమస్యను దృష్టిమరల్చడం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, తెలుగు సినీ సెలబ్రిటీలు మరియు ఇతర తెలుగు ఫిల్మ్ ఫ్రాటర్నిటీ సభ్యులు చాలా మందికి టార్గెట్ గా మారారని ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తులపై చేసిన దుర్మార్గమైన మరియు హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని తెలియజేయుచున్నాము.
రాజకీయాలు మరియు చలనచిత్ర పరిశ్రమ సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ రంగాలు పరస్పర సహకారం మరియు గౌరవం అందిపుచ్చుకుంటూ సమాజంలో తమ బాధ్యతను గుర్తెరిగి ఉండడం చాలా కీలకం. రాజకీయ నాయకులు అపారమైన అధికారాన్ని కలిగి ఉంటారు మరియు సినిమాలు సాంస్కృతిక కథనాలను రూపొందిస్తాయన్నది వాస్తవం. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని ప్రభావవంతమైన వ్యక్తులు మరియు అధికారంలో ఉన్న వ్యక్తులు దుర్వినియోగం చేయకూడదు. సంస్కృతిని ప్రభావితం చేయడంలో మరియు సాధారణ ప్రజల దృక్కోణాలను రూపొందించడంలో సినిమా రంగం సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలు జీవితాలను ప్రభావితం చేసే విధానాలను రూపొందిస్తాయి. రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి మరియు సినిమాలు సమాజంలో సామాజిక భాద్యతను తెలియజేసేలా ప్రతిబింబిస్తాయి. ఈ రెండు ప్రపంచాల మధ్య వ్యత్యాసాన్ని అందరూ అభినందిద్దాం ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు సమాజం యొక్క అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్దాం.
ఇకనైనా ఇలాంటి హేయమైన చర్యలను మానుకోవాలని, అందరినీ కోరుతున్నాము. మా మీడియా మిత్రులను (ప్రింట్, సోషల్, ఎలక్ట్రానిక్స్ మరియు డిజిటల్) నైతికత, వివేకాన్ని, విలువలను పాటించవలసిందిగా కోరుతున్నాము. తెలుగు చలనచిత్ర పరిశ్రమ జాతి/లింగ/మత వివక్ష లేకుండా లౌకిక సంస్థగా ఎల్లప్పుడూ ముందంజలో ఉండి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను తెచ్చిపెట్టింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఇప్పుడు మరియు భవిష్యత్తులో తమ సభ్యులకు అండగా నిలుస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి సున్నితమైన విషయాలపై ఎవరైనా ఈ విధంగా మాట్లాడిన యెడల అలాంటి వారిపై బలమైన తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడరాని మరొకసారి తెలియజేస్తున్నాము. - (కె.ఎల్. దామోదర్ ప్రసాద్) గౌరవ కార్యదర్శి