TFCC: మంత్రి పిఏకు ఫోన్ చేసి మంత్రిగారిని ఫంక్షన్‌కు రాకుండా చూసుకోమని చెప్పారట..
ABN , Publish Date - Nov 11 , 2024 | 09:19 PM
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ముందు టీఎఫ్‌సీసీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. తెలంగాణ సినీ కార్మికులు సభ్యులుగా ఉన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం రెంట్ తీసుకుని నిర్వహిస్తున్నాం. ఫిలింనగర్లో 800 గజాల స్థలం ఇప్పించగలరని కోరుతున్నాం. ఆ స్థలంలో సొంత కార్యాలయం నిర్మించుకుంటాం. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాల పైన అవుతుంది. 40 సినిమాల వరకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక ఎనిమిది సినిమాలు డైరెక్షన్ చేయడం జరిగింది, అలాగే 250 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న ఏ ఒక్క కార్మికునికి కూడా చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదు, కాబట్టి మా చాంబర్లో ఉన్న కార్మికులందరికీ ఇల్లు ఇప్పించాలని కోరుతున్నాను. మా తెలంగాణలో ఉండే కొందరు బడా నిర్మాతలు మంత్రి గారి పి ఏ లకు ఫోన్ చేసి మంత్రిగారిని ఫంక్షన్‌కు రాకుండా చూసుకోండి అని చెప్పారు, అయినా ఎవ్వరిని లెక్కచేయకుండా మంత్రిగారు మా ప్రోగ్రాంకు రావడం నిజంగా చాలా చాలా సంతోషం. రావడమే కాదు మేము అడిగిన కోరికలన్నీ తీరుస్తానని చెప్పారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. కానీ చిన్న చిత్రాలకు టికెట్ రేట్స్ హైక్ అవసరం లేదు. థియేటర్స్‌లో చిన్న సినిమా రిలీజ్ కు క్యూబ్, యూఎఫ్‌వో వంటి కంటెంట్ ప్రొవైడర్స్ కు తమిళనాట 2500 ఉంటే మన దగ్గర 10 వేలు వసూలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఈ కంపెనీలకు మద్ధతుగా ఉన్నారు. నేను గతంలో నిరాహార దీక్ష చేస్తే 3 వేల వరకు ఈ ఛార్జీలు తగ్గించారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి. అలాగే చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం లేదు. మా సభ్యుల్లో కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని కోరుతున్నానని అన్నారు.
Also Read-Krish weds Priti: సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న క్రిష్.. పెళ్లి ఫొటోలు వైరల్
టీఎఫ్‌సీసీ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్ మాట్లాడుతూ.. మంచితనానికి మారుపేరు మా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు. ఆయన ఈ రోజు మా ఈవెంట్‌కు రావడం సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద నుంచి మంత్రి గారికి ఒక విన్నపం చేస్తున్నాం. చిత్రపురి కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. వాటిపై మీరు దృష్టి సారించాలి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారితో మేము జర్నీ చేస్తుండటం సంతోషంగా ఉందని తెలిపారు.
Also Read-Pushpa2 The Rule: ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్
ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఎన్నికైన సభ్యులకు నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. తెలుగు సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చుకుంటోంది. సొసైటీకి మంచి ఆలోచనలు చెప్పేందుకు సినిమాను మించిన గొప్ప మాధ్యమం లేదు. ఆ క్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా భాగమవడం ఆనందంగా ఉందని అన్నారు.
సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అసోసియేషన్ ద్వారా వారు ఎంతోమందికి సపోర్ట్ అందిస్తున్నారు. నాకు సినిమాలంటే ఇష్టం. అయితే చిత్ర పరిశ్రమ ఎవరో ఐదారుగురు పెద్ద వారిదే కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదీ. అందరికీ నటన రాదు. వచ్చిన కళాకారులకు మనం సపోర్ట్‌గా నిలబడాలి. మా భూమి నుంచి మొన్నటి బలగం వరకు తెలంగాణ వాళ్లు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం. నా దగ్గరకు థియేటర్స్ ఇప్పించమని వచ్చే ప్రతి చిన్న సినిమా వారికి నా సహకారం అందిస్తున్నా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తాం. అలాగే చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ లో మన తెలంగాణ సినిమా వారికి ఫ్లాట్స్ ఇప్పిస్తాం. మీకు ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం తరుపున గానీ, వ్యక్తిగతంగా నా తరుపున గానీ చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ సెక్రటరీ జేవీఆర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కాచం సత్యనారాయణ, టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్, నటి కవిత, టీ మా సెక్రటరీ స్నిగ్ధ, హీరో కిరణ్ వంటి వారు ప్రసంగించారు.