Tollywood: తెలుగు రాష్ట్రాలకు అండగా చిత్ర పరిశ్రమ.. ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
ABN , Publish Date - Sep 03 , 2024 | 03:05 PM
ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద బాధిత ప్రాంతాలలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నష్టం భారీగానే జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మరింత మంది సెలబ్రిటీలు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ఉభయ తెలుగు రాష్ట్రాలు (Telugu States) వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood) ముందుకొచ్చింది. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. అలాగే ‘ఆయ్’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం వరద బాధితులకు జనసేన పార్టీ ద్వారా విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద బాధిత ప్రాంతాలలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నష్టం భారీగానే జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మరింత మంది సెలబ్రిటీలు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.
జూనియర్ ఎన్టీఆర్ రూ. కోటి, విశ్వక్సేన్ రూ. 10 లక్షలు
మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr), మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందిస్తూ తమ సానుభూతి తెలియజేశారు. ‘భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను’ అంటూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా రూ. కోటి విరాళం ప్రకటించారు. విశ్వక్ సేన్ కూడా సోషల్ మీడియా వేదికగా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా రెండు తెలుగు రాష్ట్రాలకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు.
త్రివిక్రమ్, ఎస్. రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ రూ. 50 లక్షలు
గత కొద్ది రోజులుగా అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో సంయుక్తంగా రూ. 50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నామని తెలిపారు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ మరియు నాగవంశీ. ఇందులో ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లుగా వారు ప్రకటించారు. ‘‘భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా వంతు సాయంగా చేయూత అందిస్తున్నాము’’ అని వారు ప్రకటించారు.
హీరో సిద్ధు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు, వెంకీ అట్లూరి రూ. 10 లక్షలు
తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తోంది. ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశాయి. ఇలాంటి సమయాల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యవసరం. వరద బాధితులకు నా వంతు సహకారంగా రూ. 30 లక్షల ఆర్థిక సహాయాన్ని (రూ. 15 లక్షలు ఆంధ్రప్రదేశ్‌కి, మరో రూ. 15 లక్షలు తెలంగాణకి) వరద సహాయనిధికి ప్రకటిస్తున్నాను. ఇది కొంతమందికైనా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను..’’ అని సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. దర్శకుడు వెంకీ అట్లూరి ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు.. మొత్తంగా రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.
ఇప్పటి వరకు సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు
త్రివిక్రమ్ - రాధాకృష్ణ - నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు
ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
విశ్వక్సేన్- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు
వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
అనన్య నాగళ్ల- ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు