Hanuman : ‘హనుమాన్’కి విజువల్ ఎఫెక్ట్స్.. నా పూర్వజన్మ సుకృతం! రాజమౌళి సరసన ప్రశాంత్ వర్మ
ABN , Publish Date - Jan 22 , 2024 | 03:58 PM
‘హనుమాన్’ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా పనిచేసే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని, భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉదయ్ కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు.
‘హనుమాన్’(Hanuman) చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా పనిచేసే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని, భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మ (Prasanth Varma)కు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉదయ్ కృష్ణ (Uday Krishna) భావోద్వేగానికి లోనయ్యారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత దార్శనికత ప్రశాంత్ వర్మలోనూ పుష్కలంగా ఉందంటూ ఉదయ్ కృష్ణ (Uday Krishna) ప్రశంసల వర్షం కురిపించారు.
తేజా సజ్జా టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్త్సైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘హనుమాన్’ జనవరి 12న విడుదలై విజయ దుందుభి మ్రోగిస్తోంది. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథ - కథనాలకు ఉదయ్ కృష్ణ (Uday Krishna) సారధ్యంలో గ్రాఫిక్స్ జత కలవడంతో ‘హనుమాన్’ (Hanuman) చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రం ఇప్పటికే తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై "విజువల్ ఫీస్ట్"గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పుడు మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్ లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన ‘హనుమాన్’ (Hanuman) ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తున్న విజయంతో తాను ఈ చిత్రం కోసం పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని ఉదయ్ (Uday Krishna) అన్నారు. పతాక సన్నివేశాల్లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్ కు జీవం పోసే సన్నివేశాల కోసం అతి పెద్ద ఛాలెంజస్ ఫేస్ చేశానన్నారు. ఇదిలాఉండగా ఉదయ్ (Uday Krishna) ప్రస్తుతం "బీస్ట్ బెల్స్" పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ ఎఫెక్ట్స్ అందించే సంస్థను హైద్రాబాద్ లోనే నెలకొలిపే సన్నాహాల్లో తలమునకలై ఉన్నారు.