Venu - Balagam: అలా అనుకున్న వారికి సమాధానం!

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:12 PM

"బలగం (Balagam) కథ రాశాను కానీ డైరెక్ట్‌ చేయాలంటే ఎక్కడో కాస్త ఆలోచించా. మిత్రులు, డిస్ట్రిబ్యూటర్  శివరాం మంచి కథ, చక్కని హీరోని పెట్టి చేద్దామన్నారు. భావోద్వేగాలతో కూడిన కథ కావడంతో డీల్‌ చేయగలనా లేదా అన్న సందిగ్ధంలో పడ్డా. ‘మీరు తప్ప ఇంకెవరూ డైరెక్ట్‌ చేసినా ఊహించినంత మంచిగా రాదు. ఆలోచించుకోండి’ అని ఆయన అన్నారు

Venu - Balagam: అలా అనుకున్న వారికి సమాధానం!

"బలగం (Balagam) కథ రాశాను కానీ డైరెక్ట్‌ చేయాలంటే ఎక్కడో కాస్త ఆలోచించా. మిత్రులు, డిస్ట్రిబ్యూటర్  శివరాం మంచి కథ, చక్కని హీరోని పెట్టి చేద్దామన్నారు. భావోద్వేగాలతో కూడిన కథ కావడంతో డీల్‌ చేయగలనా లేదా అన్న సందిగ్ధంలో పడ్డా. ‘మీరు తప్ప ఇంకెవరూ డైరెక్ట్‌ చేసినా ఊహించినంత మంచిగా రాదు. ఆలోచించుకోండి’ అని ఆయన అన్నారు. కాస్త ఆలోచించి ‘అన్నీ నా జీవితంలో జరిగినవే కదా. నేనే సినిమా చేస్తా’ అని అప్పుడు నమ్మకంగా చెప్పా’’ అని వేణు అన్నారు. జబర్దస్త్‌తో కమెడీయన్ గా  గుర్తింపు పొందిన ఆయన బలగం’ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

"మాది చాలా పెద్ద కుటుంబం. దాదాపు రెండు వందల మంది ఉంటారు. ఎవరైనా చనిపోతే చేదు నోరు విడిపించడం అనే కార్యక్రమం ఉంటుంది. చనిపోయిన వారి ఇంటికి వచ్చి వారి బాధను దూరం చేయాలని వారితో పాటు తిని వెళ్లేవాళ్లు. అది ఆచారంగా మారిపోయింది. మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబంలో ఉన్నవారంతా వచ్చారు. వారిని చూస్తే చనిపోతే వచ్చినట్లు లేదు. ఏదో పండగ చేసుకోవడానికి వచ్చినట్లు ఉందనిపించేది. అక్కడ నాకు బలగం కథ మొదలైంది. ఓసారి మా పెద్దమ్మ చనిపోయిన వారం రోజులకే మా పెద్దనాన్న చనిపోయారు. కుటుంబమంతా వెళ్లారు. నేను వెళ్ళలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత మా ఊరిలో ఉండే అన్న దగ్గరకి వెళ్లి మాట్లాడా. అప్పుడు మా అన్న చెప్పాడు. చేదునోరు విడిపించడం కార్యక్రమానికి మావాళ్లు దాదాపు 150 మంది రావడంతో అంతా ఓ పండగలా అనిపించిందని. అలా ఎవరైనా ఎక్కువమంది ఒక చోటకి చేరితే బుడగ జంగమ్మలు అక్కడికి వచ్చి చిన్నపూస అనే పాట పాడేవారు. వారి దగ్గర ఒకటే సెటప్‌ ఉండేది. పేర్లు మార్చి పాడేవారు.

Balagam.jpg

మా అన్నయ్య పెదనాన్న, పెద్దమ్మల పేర్లు చెప్పి పాడమని చెప్పడం, వారు మా అన్న బుచ్చయ్య, ఏడికెళ్లావురా అంటూ పాట మొదలుపెట్టడం, బంధువులంతా వారి వారి పేర్లు చెప్పి, పాడమని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేవాళ్లు మా అన్న అది చెప్పినప్పుడు విని ఇది కదా నాకు కావాల్సిందనుకున్నా. మొదట అనుకున్న క్లైమాక్స్‌ వేరు. అది కొంచె నవ్వు తెప్పించేలా ఉంటుంది. కథ అంతా పూర్తయిన తర్వాత అది ఎందుకో నచ్చలేదు. అప్పుడు సినిమాలో ఉన్న క్లైమాక్స్‌ రాశా. ఈ కథ రాసినప్పుడే నాకు నమ్మకం ఏర్పడింది. షూటింగ్‌ సమయంలో అది రుజువైంది. సినిమాలో ఎవరూ యాక్టర్స్‌ కాదు. ఆ ఊరిలో ఉన్నవారితోనే షూటింగ్‌ చేశా. చిత్రీకరణ చేస్తున్న సమయంలోనే ఆ వాతావరణం, సన్నివేశాలు చూసి, చాలామంది భావోద్వేగానికి గురయ్యేవారు. అవన్నీ చూశాక సినిమా హిట్‌ అవుతుందని నమ్మకం కుదిరింది. వేణు ఏంటి సినిమా చేయడం ఏంటి అనుకునేవారికి ఇది ఒక సమాధానం’’ అని అన్నారు. 

Updated Date - Feb 06 , 2024 | 04:12 PM