National Awards: తెలుగు సినిమాకు అన్యాయం జరిగిందా?
ABN , Publish Date - Aug 17 , 2024 | 10:39 AM
జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం ప్రకటించారు. గత ఏడాది తెలుగు సినిమాకు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు సహా తొమ్మిది అవార్డులు రావడంతో కాలరు ఎగరేసిన తెలుగు ప్రేక్షకుడు ఈసారి ప్రకటించిన అవార్డుల్లో తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డ్ కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచనలో పడ్డాడు.
జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం ప్రకటించారు. గత ఏడాది తెలుగు సినిమాకు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు సహా తొమ్మిది అవార్డులు రావడంతో కాలరు ఎగరేసిన తెలుగు ప్రేక్షకుడు ఈసారి ప్రకటించిన అవార్డుల్లో తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డ్ కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచనలో పడ్డాడు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సినిమాలకు ప్రభుత్వ అవార్డులు అన్నవి లేనేలేవు. ఇప్పుడైనా ఇస్తారో, ఇవ్వరో తెలియని పరిస్థితి. ఫిల్మ్ ఫేర్ వంటి ప్రైవేట్ అవార్డులను పక్కన పెడితే, సినిమా ప్రముఖులు ఆశించేది, రావాలని కోరుకునేది జాతీయ చలనచిత్ర అవార్డులే. జాతీయ అవార్డ్ పొందితే కెరీర్ పరంగా ఏదో సాధించామనే సంతృప్తి చాలా మందికి ఉంటుంది. అయితే జాతీయ అవార్డు అందుకునే స్థాయి కలిగిన చిత్రాలు తెలుగులో ఎన్ని వస్తున్నాయనేది ఒక ప్రశ్న. తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్‌కు కొదువ లేదు. సినీ ప్రపంచమంతా తెలుగు చిత్రపరిశ్రమ వైపే చూస్తున్న రోజులివి. కొత్త తరహాగా ఆలోచించడం, కష్టపడే తత్వం తెలుగు వారికి ఎక్కువ. అయినా సరే కొత్త తరహా చిత్రాల గురించి ఆలోచించకుండా కమర్షియల్ చిత్రాలపై మోజుతో నిర్మాతలు పరుగులు తీస్తున్నారన్నది ఎవరూ కాదనలేని సత్యం. కాకపోతే ఈ ఏడాది ఢిల్లీకి పంపిన చిత్రాల్లో అవార్డుకు అర్హమైనవి కొన్ని ఉండడం వాటికి ఒక్క అవార్డ్ కూడా రాకపోవడం చర్చనీయాంశం అయింది.
Also Read- 70th National Film Awards: ఉత్తమ నటులు, నాయికలు, చిత్రాల విజేతలు వీరే
కరోనా కారణంగా..
శుక్రవారం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ 2022 సంవత్సరంలో సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలకు సంబంధించినవి. వాస్తవానికి 2023 మే 3న ఈ అవార్డులను ప్రదానం చేయాలి. అయితే కరోనా తర్వాత జాతీయ చలన చిత్ర అవార్డుల షెడ్యూల్‌లో మార్పులు జరిగియి. అవార్డుల ఎంపిక, ప్రదాన కార్యక్రమం ఆలస్యమవుతూ వస్తున్నాయి. లోకసభకు జరిగిన ఎన్నికల కారణంగా జాతీయ అవార్డులు ఈసారి మరింత ఆలస్యమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైనా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో దానిని మధ్యలోనే ఆపేసి ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాక మళ్లీ మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రకటించిన అవార్డులను అక్టోబరు నెలలో విజేతలకు అందజేస్తారని సమాచారం.
ఇరవై సినిమాలు... ఒకే ఒక్క అవార్డ్
జాతీయ అవార్డుల కోసం తెలుగు నిర్మాతలు ఈసారి పెద్ద సంఖ్యంలోనే ఎంట్రీలు పంపారు. ఆ జాబితాలో ఉన్న సినిమాలు ఏమిటంటే
1. రైటర్ పద్మభూషణ్,
2. సీతారామం
3. అంటే సుందరానికి..
4. విరాటపర్వం
5. యశోద
6. రాధేశ్యామ్
7. సర్కారు వారి పాట
8. మర్రి చెట్టు
9. కుదిరామ్ బోస్
10. ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం
11. కార్తికేయ 2
12. డీజె టిల్లు
13. ఇక్షూ
14. ధమాకా
15. చదువే నా ఆయుధం
16. బింబిసార
17. భారత పుత్రులు
18. ఎట్ లవ్
19. అశోకవనంలో అర్జున కల్యాణం
20. అల్లూరి.
ఇన్ని సినిమాలు పంపిస్తే వాటిల్లో ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఏ అవార్డూ దక్కలేదు. ఇది ఆలోచించాల్సిన అంశం. ‘కార్తికేయ 2’ చిత్రానికి ఇచ్చారు కదా అని అంటే అది ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఇచ్చిన అవార్డు. ఆ ఆవార్డు తెలుగు సినిమాకే ఇవ్వాలి కనుక కంటితుడుపు అన్నట్లు ‘కార్తికేయ 2’కు ప్రకటించి చేతులు దులుపేసుకుంది అవార్డుల కమిటీ.
ఆ రెండు సినిమాలను పక్కన పెట్టేశారా?
‘యుద్ధం రాసిన ప్రేమలేఖ’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకొన్న చిత్రం ‘సీతారామం’ వైజయంతీ మూవీస్ సంస్థ సగర్వంగా సమర్పించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించిన సినిమా ఇదని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంది. చక్కని కథ, కథనాలతో రూపుదిద్దుకున్న ‘సీతారామం’కు జాతీయ అవార్డు ఖాయం అని అందరూ అనుకున్నారు. తీరా శుక్రవారం ప్రకటించిన అవార్డుల జాబితాలో ఆ సినిమా ఊసే లేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ‘సీతారామం’ చిత్రం చివరి వరకూ పోటీలో ఉంది. అయితే అందులో సుమంత్ పోషించిన పాత్ర పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉందనే సాకుతో అవార్డుల కమిటీ సినిమాను పక్కను పెట్టేసిందట. అలాగే నక్సలైట్లకు అనుకూలంగా, నక్సలిజాన్ని సమర్ధించే రీతిలో ‘విరాటపర్వం’ చిత్రం ఉందంటూ ఆ సినిమాను కూడా పక్కన పెట్టేశారని అంటున్నారు. కల్యాణ్‌రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రం కూడా కొత్త తరహా ప్రయత్నం. ఆ సినిమాను కూడా అవార్డుల కమిటీ పట్టించుకోలేదు. జ్యూరీలో తెలుగు సభ్యుడు కనీసం ఒకరున్నా తెలుగు సినిమాకు ఇలా అన్యాయం జరిగేది కాదనీ, పైట్ చేసి ఏదో ఒక సినిమాకు అవార్డ్ తీసుకువచ్చేవారని అంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇతర భాషల వారు పెత్తనం చెలాయించి, అవార్డుల పరంగా తెలుగు సినిమాకు అన్యాయం చేశారని చిత్ర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారికి అవార్డులు ఇచ్చారు కానీ..
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ముగ్గురికి ఈసారి జాతీయ అవార్డులు రావడం కొంతలో కొంత ఉపశమనం. అయితే వారు అవార్డులు పొందింది తెలుగు చిత్రాలకు కాదు.. తెలుగేతర చిత్రాలకు.
నిత్యా మీనన్‌కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ వచ్చింది. అయితే తెలుగు సినిమా కాదు ‘తిరుచిట్రంబలం’ తమిళ చిత్రం. అలాగే ఎ.ఆర్.రెహమాన్ కూడా తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ చిత్రానికే ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డ్ పొందారు. అదే విధంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా తమిళ సినిమాతోనే జాతీయ అవార్డ్ పొందారు.
Read Latest Cinema News