Friendship Day Spl: సినీతారలు.. ఫ్రెండ్‌షిప్ డే ముచ్చట్లు!
ABN , Publish Date - Aug 04 , 2024 | 11:11 AM
‘ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే... ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్‌షిప్పే’ అన్నాడో సినీ కవి. ‘నిజమే.. నోట్‌బుక్ నుంచి ఫేస్‌బుక్‌కి మారినా.. ఫ్రెండ్ అన్న మాటలోన ఫీలింగ్ మారునా?’ అంటున్నారు మన సెలబ్రిటీలు.
‘ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే... ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్‌షిప్పే’ అన్నాడో సినీ కవి. ‘నిజమే.. నోట్‌బుక్ నుంచి ఫేస్‌బుక్‌కి మారినా.. ఫ్రెండ్ అన్న మాటలోన ఫీలింగ్ మారునా?’ అంటున్నారు మన సెలబ్రిటీలు. నేడు ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా తమ ‘బెస్ట్ ఫ్రెండ్’ గురించి కొందరు సినీతారలు ఏం చెబుతున్నారంటే... (International Friendship Day)
అది నా అదృష్టం
స్నేహం అనేది మనం కొనలేని, అమ్మలేని అమూల్యమైన బహుమతి. ప్రతీ మనిషి జీవితంలో ప్రతి దశలోనూ స్నేహితులుంటారు. కానీ అన్ని దశల్లోనూ ఒక్కరే ఉండటం అదృష్టం అనేది నా అభిప్రాయం. నా లైఫ్‌లో అలాంటి వ్యక్తే స్వాతి. నాలాగే తనకి కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుకే నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరం కలిసి గుడులు, గోపురాలంటూ తిరుగుతుంటాం. బయట ప్రపంచాన్ని మరిచిపోయి మరీ గంటల తరబడి ముచ్చట్లతోనే గడిపేస్తాం. చిన్నప్పటి నుంచి మేము బడ్డీస్ కాబట్టి తనని మా ఇంట్లో మనిషిలానే చూస్తారు మావాళ్లంతా.
- సాయిపల్లవి (Sai pallavi)
ఇండస్ట్రీకి రాకముందే...
నేను, వాణీకపూర్ ఇప్పుడు కాదు... ఇండస్ట్రీకి రాకముందు నుంచే మంచి స్నేహితులం. నిజానికి నేను హీరోయిన్‌గా మీ అందరి ప్రేమానురాగాలు పొందుతున్నానంటే దానికి పరోక్ష కారణం ఆమే. తన ప్రోత్సాహం వల్లే నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టా. కెరీర్‌లో జయాపజయాలు, ఎత్తుపల్లాలు ఎదురైన సమయాల్లోనూ ఒకరికొకరం తోడుగా నిలిచాం. ఇన్నేళ్ల మా స్నేహబంధంలో ఈనాటికీ ఏ రోజూ మా మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు. మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవం అలాంటిది. తను నా స్నేహితురాలే కాదు... సోదరిలాంటిది కూడా.
- రాశీఖన్నా (Raashi khanna)
ఇరవయ్యేళ్ల స్నేహం
నాకున్న కొద్దిమంది స్నేహితుల్లో తమన్నా ఒకరు. మా స్నేహానికి రెండు దశాబ్దాల చరిత్ర ఉంది. మొదట్లో రూమ్‌మేట్స్‌గా పరిచయమయ్యాం. అప్పట్లో మా ఇద్దరికీ అస్సలు పడేది కాదు. ఎడముఖం, పెడముఖం అన్నట్లుగానే ఉండేవాళ్లం. కానీ తర్వాత ప్రాణ స్నేహితులుగా మారిపోయాం. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా తన కోసం ప్రత్యేకించి సమయం కేటాయిస్తా. ఇద్దరం కలసి పిల్లలను వెంటబెట్టుకుని తరచుగా ట్రిప్‌లకు వెళ్తుంటాం. నిజానికి ఇప్పుడు నేను, తమన్నానే కాదు... మా భర్తలు కూడా మంచి స్నేహితులైపోయారు.
- ప్రియాంక చోప్రా (Priyanka chopra)
అన్నీ చెల్లెలే...
నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినా, శ్రేయోభిలాషైనా నా చెల్లి నుపూర్ సననే. అమ్మానాన్నలతో కూడా షేర్ చేసుకోలేని విషయాలను నా చెల్లితో మనసు విప్పి చెప్పుకోగలను. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. మా మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. ప్రతీ విషయం కూడా ఒకరికొకరం పంచుకుంటాం. నేను షూటింగ్స్‌లో ఉన్నా కూడా రోజుకి ఒక్కసారైనా చెల్లితో వీడియోకాల్ మాట్లాడాల్సిందే. లేదంటే మనసు లాగేసినట్లుంటుంది. ఇక ఇద్దరం ఇంట్లోనే ఉంటే మాత్రం ఓ రేంజ్‌లో అల్లరి చేస్తాం.
- కృతిసనన్
ఒకే కంచం, ఒకే మంచం
సంగీత దర్శకుడు రోచక్ కోహ్లీ, నేను ఎనిమిదో తరగతి నుంచే స్నేహితులం. మా ఇద్దరిదీ ఒకే కంచం, ఒకే మంచం అన్నమాట. అప్పట్లో మా ఇద్దరికీ సంగీతం అంటే పిచ్చి. స్కూలుకి బంక్ కొట్టి మరీ పాటలను కంపోజ్ చేసేవాళ్లం. స్కూల్‌లో ఏ కార్యక్రమం జరిగినా మా సంగీత ప్రదర్శన కచ్చితంగా ఉండేది. కాలేజీలో అడుగుపెట్టాక ‘ఆఘాజ్’ అనే థియేటర్ గ్రూప్‌ని ప్రారంభించి నాటక ప్రదర్శనలు ఇచ్చేవాళ్లం. అలా మొదటి నుంచి చదువుపై కన్నా సృజనాత్మకత వైపే మొగ్గు చూపేవాళ్లం. రోచక్ చాలా ప్రతిభావంతుడు. అంతకన్నా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి కూడా.
- ఆయుష్మాన్ ఖురానా