Heroines - Holy: ఆనందం రంగులకేళీ విలాసం.
ABN , Publish Date - Mar 24 , 2024 | 12:07 PM
చేతిలోని రంగు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది ఎదుటివారిని కమ్మేస్తుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. ‘హోలీ ఆయిరే...’ (Holy Festival) అంటూ గంతులేస్తుంది. ఆ రంగుల్లో తడిసిముద్దయిన అనుభూతులను పంచుకుంటున్నారీ ముద్దుగుమ్మలు...
చేతిలోని రంగు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది ఎదుటివారిని కమ్మేస్తుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. ‘హోలీ ఆయిరే...’ (Holy Festival) అంటూ గంతులేస్తుంది. ఆ రంగుల్లో తడిసిముద్దయిన అనుభూతులను పంచుకుంటున్నారీ ముద్దుగుమ్మలు...
అత్తయ్య ఇంట్లో...
చిన్నప్పుడు హోలీ పండుగ రాగానే బ్యాగ్ సర్దుకొని రూర్కీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లిపోయేదాన్ని. కజిన్స్ అందరూ వచ్చేవాళ్లు. దాంతో ఇళ్లంతా సందడి సందడిగా ఉండేది. పొద్దున్నే లేచి మేమంతా హోలీ డెకరేషన్ పనులు చూసుకునేవాళ్లం. అలాగే కావాల్సిన రంగులన్నీ సిద్ధం చేసేవాళ్లం. మరోవైపు అత్తయ్య మా కోసం రకరకాల వంటలను తయారుచేసి పెట్టేది. రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు చిందులేసేవాళ్లం. అలా.. అలిసిపోయేంతవరకూ ఆ రంగుల్లో తడిసి ముద్దయ్యేవాళ్లం. హోలీనాడు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ఎక్కువ ఇష్టపడతా. - - -రాశీఖన్నా(Raashi khanna)
రంగులు పడవు కానీ...
హోలీతో నాకు బోలెడు తీపి అనుభవాలతో పాటు ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా... మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరం కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చి సబ్బుతో ఎంత రుద్దినా సరే కలర్స్ వదల్లేదు. దాదాపు 20 రోజులదాకా ఆ రంగులు నా ఒంటి మీద అలాగే ఉండిపోయాయి. క్రమంగా చర్మంపై దురద, దద్దుర్లు రావడం మొదలయ్యాయి. దాంతో నాకు రంగులంటే అలర్జీ అని గ్రహించి అప్పటి నుంచి హోలీ ఆడడం మానేశాను. అయితే స్నేహితులతో కలిసి రెయిన్ డ్యాన్స్‌లో మాత్రం పాల్గొంటా. హోలీ ప్రస్తావన రాగానే గుర్తుకువచ్చేవి... కాజూ కట్లీ, చాక్లెట్ కేక్.
- కృతీశెట్టి (Krithi Shetty)
గ్యాంగ్‌తో కలిసి...
నా జీవితంలో హోలీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజున మా ఇంట్లో హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది. అందరం కలిసి పెద్ద ఫ్యామిలీ పండుగలా జరుపుకొంటాం. పూజ చేసి, ఆపై ఆర్గానిక్ కలర్స్ పూసుకుంటాం. చిన్నప్పుడు మా కజిన్స్ అంతా పొద్దున్న పడకమీద ఉండగానే నేనెళ్లి వాళ్లందరికీ రంగులు పూసేదాన్ని. నా గ్యాంగ్‌తో కలిసి రెయిన్ డ్యాన్స్‌లో పాల్గొనేదాన్ని.
- కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal)
వీధులన్నీ రంగులమయం
నాకు ఇష్టమైన పండుగల్లో హోలీ ముఖ్యమైనది. చిన్నప్పుడైతే వారం ముందు నుంచే స్నేహితులందరం కలిసి అన్ని ఏర్పాట్లు చేసేవాళ్లం. స్కూలు నుంచి రాగానే మా రంగేళీ మొదలయ్యేది. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టేవాళ్లం. మా ధాటికి వీధులన్నీ రంగులమయం అయ్యేవి. హోలీ రోజున కొన్ని జాగ్రత్తలు పాటిస్తా. జుట్టుకు ముందే కొబ్బరినూనె పూసుకుంటా. అలాగే రంగులు వదిలించుకున్న వెంటనే చర్మానికి మాయిశ్చరైజ్ క్రీమ్ అప్లై చేస్తా. సింపుల్‌గా పోనీ టెయిల్‌తో సంబరాల్లోకి దిగుతా.
- దీపికా పదుకొనే(deepika padukone)
వాటర్ బెలూన్స్ మజా
మా కాలనీలోని సెంట్రల్ పార్క్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరిగేవి. ఒకరి మీద ఒకరం వాటర్ బెలూన్స్ విసురుకునేవాళ్లం. అంతటితో ఆగకుండా ఒక బాత్‌టబ్ నిండా రంగు నీళ్లు కలిపి, ఒకరి తర్వాత ఒకరిని ఎత్తుకెళ్లి అందులో పడేసేవాళ్లం. అలా ఓ రేంజ్లో మా హంగామా ఉండేది. హోలీ ఆడేముందు కొన్ని చర్మ జాగ్రత్తలు తీసుకుంటా. కొబ్బరినూనెతో చర్మాన్ని బాగా మాయిశ్చరైజ్ చేస్తా. దీనివల్ల చర్మానికి అంటిన రంగులు సులువుగా వదులుతాయి. హోలీ నాడు తెలుపు రంగు కుర్తా బెస్ట్ ఛాయిస్.
- కృతీసనన్(Krithi sanon)