High Court: నాగచైతన్య, శోభితకు లేని ఇబ్బంది మీకెందుకు.. వేణు స్వామి కేసులో ట్విస్టు
ABN , Publish Date - Aug 29 , 2024 | 07:15 AM
నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిర్యాదుదారులపై , మహిళా కమీషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
నాగచైతన్య ( Naga Chaitanya), శోభిత (Sobhita Dhulipala) లకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిర్యాదుదారులపై , మహిళా కమీషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నిత్యం సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాల్లో ఉంటుంటాడు ప్రముఖ అస్ట్రాలజర్ వేణుస్వామి (Venu Swamy) ఇటీవల అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వారి జాతకాలను విశ్లేషిస్తూ.. ఇజంట ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు, రెండు మూడు సంవత్సరాలలోనే విడిపోతారు అని.. అది కూడా ఒక అమ్మాయి వల్ల అంటూ ఒక వీడియో విడుదల చేశారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలోతెగ వైరల్ అయి తీవ్ర విమర్శలకు దారి తీసింది. చాలామంది బాహాటంగానే వేణుస్వామి (Venu Swamy) ని తిడుతూ పోస్టులు పెట్టి ఎడా పెడా వాయించేశారు. కొంతమంది పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్‌లు రియాక్ట్ అయి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారదను కలిసి వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.
అయితే ఈ విషయమై వేణు స్వామి (Venu Swamy) వివరణ కోరుతూ వ్యక్తిగతంగా హజరవ్వాలని మహిళా కమీషన్ నోటీసు పంపగా.. వేణు స్వామి ఆ నోటీసుపై హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించాడు. మహిళా కమీషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. నాగచైతన్య ( Naga Chaitanya), శోభిత (Sobhita Dhulipala)లకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిర్యాదుదారులపై, మహిళా కమీషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.