Tollywood Artists Spl Talent : నటనే కాదు.. మరెన్నో ప్రత్యేకతలు వీరిలో...
ABN , Publish Date - Apr 21 , 2024 | 09:34 AM
తెర మీద వారు నటిస్తుంటే అద్భుతం అంటూ చప్పట్లు కొడతాం. డ్యాన్స్, స్టంట్స్ చేస్తుంటే థ్రిల్లవుతాం. వృత్తిగతంగా వారికది రీలుతో పెట్టిన విద్య. కానీ కొందరు తారలు వ్యక్తిగతంగా కూడా ఇతరత్రా టాలెంట్స్ కలిగి ఉంటారు. అప్పుడప్పుడు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి ప్రత్యేక ‘కళా’కారులే వీరు...
తెర మీద వారు నటిస్తుంటే అద్భుతం అంటూ చప్పట్లు కొడతాం. డ్యాన్స్, స్టంట్స్ చేస్తుంటే థ్రిల్లవుతాం. వృత్తిగతంగా వారికది రీలుతో పెట్టిన విద్య. కానీ కొందరు తారలు వ్యక్తిగతంగా కూడా ఇతరత్రా టాలెంట్స్ కలిగి ఉంటారు. అప్పుడప్పుడు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి ప్రత్యేక ‘కళా’కారులే వీరు... (Tollywood actors other talents)
గిటార్ కాలక్షేపం (Raashi khanna)
అందంతోనే కాదు.. తన హస్కీ వాయిస్‌తోనూ అభిమానులను కట్టిపడేస్తోంది గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా. తనలోని సింగర్‌ను ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం చేసిందీ సుందరి. మలయాళంలో ఒకటి, తెలుగులో ఐదు పాటల్ని తన స్టైల్లో పాడి అలరించింది. ఈమెలో ఉన్న మరో స్పెషల్ టాలెంట్.. గిటార్ వాయించడం. లాక్డౌన్ సమయంలో తనలోని ఈ హిడెన్ టాలెంట్‌కు మరింత పదును పెట్టిందట. షూటింగ్స్ లేకపోతే... ఎంచక్కా తనకు ఇష్టమైన సంగీత ప్రపంచంలో విహరిస్తానంటోందీ ఢిల్లీ బ్యూటీ.
అనుకరణలో దిట్ట (Mahesh babu)
ఎవరినైనా సరే అనుకరించడంలో ‘సరిలేరు నాకెవ్వరు’ అంటారు మహేష్ బాబు. సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటూనే తోటి నటీనటులను ఆసక్తిగా గమనిస్తుంటారట. రెండు గంటల పాటు ఎవరినైౖనా కాస్త లోతుగా గమనిస్తే చాలు.. అచ్చుగుద్దినట్టు వారిని ఇమిటేట్ చేసే టాలెంట్ ఆయన సొంతం. వారి హావభావాలను సైతం అనుకరిస్తారట. అంతేకాదు... మాండలికాల పైన కూడా మహేష్‌కు మంచి పట్టుంది. ‘అమ్మ, అమ్మమ్మలతో ఇంట్లో గుంటూరు యాసలోనే మాట్లాడేవాడిన’ని చెబుతాడీ సూపర్ స్టార్.
బ్యాడ్మింటన్ ఛాంపియన్ (Nivetha pethuraju)
‘చిత్రలహరి’, ‘అల.. వైకుంఠపురములో’, ‘పాగల్’, ‘ధమ్కీ’ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా పేతురాజ్. ఈమెకు సినిమాలే కాదు ఆటలంటే కూడా చాలా ఇష్టం. నివేదా ప్రొఫెషనల్ ఎఫ్ 1 కార్ రేసర్ అని మీకు తెలుసా? ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే స్పోర్ట్స్ కార్లపై మక్కువ ఏర్పడిందట. ఆ ఇష్టంతోనే 2015లో ‘డాడ్జ్’ ఛాలెంజర్ స్పోర్ట్స్ కారు కొని రేసింగ్ మొదలెట్టింది. క్రమంగా ‘ఫార్ములా వన్’ రేసింగ్‌పై పట్టు సాధించింది. అంతేకాదు... నివేదా బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడుతుంది. ఇటీవల మధురైలో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో... మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టిందీ కోలీవుడ్ బ్యూటీ.
ఇస్మార్ట్ పెయింటింగ్( Nabha natesh)
‘పెయింటింగ్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అంటోంది ఇస్మార్ట్‌భామ నభా నటేష్. ఈమెకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే మహా ఇష్టమట. అప్పట్లోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించింది. ఆపై తన కళకు మరింత సొబగులు అద్దేందుకు... కాన్వాస్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్‌లలో నైపుణ్యం సంపాదించింది. ఎంతటి కఠినమైన చిత్రమైన కేవలం నాలుగు గంటల్లోనే అవలీలగా వేస్తుందట. నభా గీసిన చార్లీ చాప్లిన్ బొమ్మకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించడం విశేషం.
చెస్‌తో చెడుగుడు (Aamir khan)
బాలీవుడ్ సూపర్‌స్టార్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌కు చెస్ ఆడడం ఒక వ్యాపకం. షూటింగ్స్‌లో కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు... తోటి నటీనటులతో చదరంగం ఆడుతూ, మెదడుకు పదునుపెడుతూ పావులు కదుపుతుంటాడు. ఈ అభిరుచితోనే మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో కూడా ఆమీర్ కొన్నాళ్ల కిందట చెస్ బోర్డుపై తలపడ్డాడు. ఒత్తిడిని అధిగమించడానికి, ఏకాగ్రతను పెంపొందించుకునేందుకు చెస్ దోహదపడుతుందని అంటారాయన.